ఇంటికి రా... నీ పని చెప్తా... | Dr KK Aggarwal phone conversation with wife after getting vaccinated | Sakshi
Sakshi News home page

ఇంటికి రా... నీ పని చెప్తా...

Published Thu, Jan 28 2021 12:56 AM | Last Updated on Thu, Jan 28 2021 4:22 AM

Dr KK Aggarwal phone conversation with wife after getting vaccinated  - Sakshi

భార్య వీణా అగర్వాల్‌తో డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌

జనవరి 23 శనివారం. ఢిల్లీలో డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ టీకా తీసుకున్నారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఢిల్లీలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌. మెడికల్‌ అసోసియేషన్స్‌– ఆసియా అధ్యక్షుడు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తుంటారు. తాను కోవిడ్‌ టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టారు. టీకాతో భయం లేదని చెబుతున్నారు. ఇంతలో భార్య ఫోన్‌ మోగింది. ‘ఏంటి... నువ్వు టీకా తీసుకున్నావా?’ అని అడిగారామె. లైవ్‌ వెళుతోంది. ‘అవును’ అన్నాడీయన. ‘ఇంటికిరా నీ సంగతి చెప్తా’ అందామె. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్‌ అయిపోయింది. కాని ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

‘నువ్వు లైవ్‌లో ఉన్నప్పుడు నీ భార్య ఫోనెత్తకు’ అని ఇప్పుడు దేశమంతా సందేశం అందుతోంది. దాంతోపాటు డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ వీడియో కూడా. ఇదంతా జరిగి ఒక నాలుగైదు రోజులవుతోంది.
అసలేం జరిగిందంటే డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ ఢిల్లీలో పేరు మోసిన కార్డియాలజిస్ట్‌. టీవీ పర్సనాలిటీ. పద్మశ్రీ కూడా వచ్చిందాయనకు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన కరోనా అవగాహన వీడియోలు, జూమ్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మొన్నటి శనివారం తాను కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకుంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు.
‘ఇదిగోండి.. నా వయసు 63. నేను బ్లడ్‌ థిన్నర్‌లు వాడతాను. అయినా సరే నేను వాక్సిన్‌ తీసుకున్నాను. నాకేం కాలేదు. కాబట్టి మీరూ వేయించుకోండి’ అని ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్‌ మోగింది. భార్య నుంచి. ఆయన లైవ్‌లో ఉండి ఫోన్‌ ఎత్తాడు.

భార్య: ఏంటి... నువ్వు వాక్సిన్‌ వేయించుకున్నావా?
అగర్వాల్‌: అవును. అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి వెళ్లాను. ఖాళీ ఉంది వేయించుకోండి అంటే వేయించుకున్నాను.

భార్య: నన్నెందుకు తీసుకెళ్లలేదు.
అగర్వాల్‌: నీకు సోమవారం వేస్తారు.

భార్య: వాక్సిన్‌ వేయించుకున్నది గాక ఇంకా ఏంటేంటో చెప్తావా... ఇంటికిరా నీ పని చెప్తా...
దాంతో అగర్వాల్‌ గారి ముఖం వాడిపోయింది. ఈ వీడియో కాస్తా వైరల్‌ అయిపోయింది. భార్యకు ఎంతటివాడైనా భయపడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నిన్న (బుధవారం) డాక్టర్‌ గారు తన ఫేస్‌బుక్‌ వాల్‌ మీద వీడియో రిలీజ్‌ చేశారు. ‘నా భార్య కోప్పడటం సబబే. నా ఆరోగ్యం గురించి వర్రీ అయ్యింది. టీకా గురించి అందరికీ సందేహాలు ఉన్నాయి కదా. తను పక్కన ఉన్నప్పుడు వేయించుకోవాల్సింది అని ఆమె ఉద్దేశ్యం. నేనేమో ఆమెకు చెప్పకుండా ఈ పని చేశాను. దీనిని పెద్దగా చర్చ పెట్టాల్సిన పని లేదు’ అన్నాడాయన.

అయితే ఈ వెర్షన్‌ను సగంమంది నెటిజన్లు నమ్ముతుంటే అగర్వాల్‌ ఒక్కడే వెళ్లి అలా టీకా వేయించుకోవడం గురించి ఆమెకు నిజంగా కోపం వచ్చిందని మిగిలిన సగం అన్నారు. ‘అయినా భర్తను అదిలించి అదరగొట్టే శక్తి భార్యకు కాక ఇంకెవరికి ఉంటుంది’ అని మరికొందరు అన్నారు. అగర్వాల్‌ భార్య పేరు వీణాఅగర్వాల్‌. ప్రస్తుతం కెకె అగర్వాల్‌తో పాటు ఆమె కూడా అందరికీ తెలిశారని మాత్రం చెప్పక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement