cordialogist
-
Gandhi Hospital: ఆస్పత్రిలో ‘గుండె’ గోస
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్ గత పద్దెనిమిది నెలలుగా మూలనపడింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్డియాలజీ విభాగం ప్రభుత్వ, వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందక హృద్రోగులు విలవిల్లాడుతున్నారు. 2010లో ఏర్పాటు.. ► గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో కార్డియాలజీ విభాగంలో 2010లో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ కార్డియాలజీ ఓపీ, ఐపీ విభాగంలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతుంటారు. ► గుండె సంబంధ వ్యాధులను నిర్ధారించేందుకు నాలుగైదు దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) తదితర పరీక్షల్లో కొన్నిరకాల రుగ్మతలు, యాంజియోగ్రాం, పెర్యూటేనియస్ ట్రాన్సుమినల్ కొరునరీ యాంజియోఫ్లాస్ట్రీ (పీటీసీఏ), ప్రోటోన్ పంప్ ఇన్‌హేబిటర్ (పీపీఐ), ట్రెపోనిమా పల్లిడం ఇమ్మోబిలైజేషన్ (టీపీఐ) తదితర అత్యంత కీలకమైన వైద్యపరీక్షలు క్యాత్‌ల్యాబ్‌లోనే నిర్ధారణ అవుతాయి. ► క్యాత్‌ల్యాబ్ నివేదిక ప్రకారమే రోగికి స్టంట్ వేయాలా? శస్త్రచికిత్స నిర్వహించాలా? అనేది నిర్ణయిస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించక క్యాత్‌ల్యాబ్ మెషీన్ పలుమార్లు మొరాయించింది. కాలపరిమితి ముగిసిన క్యాత్‌ల్యాబ్ మెషీన్ మరమ్మతులకుæ లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, కొత్తది సమకూర్చుకోవడం మేలని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య యంత్రాలు, పరికరాల కొనుగోలు, నిర్వహణ బాధ్యతల కేటాయింపులను తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. ► వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన హరీష్‌రావు స్పందించి నూతన క్యాత్‌క్యాబ్ ఏర్పాటు చేసి నిరుపేద హృద్రోగుల గుండె చప్పుడు ఆగిపోకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించాం గాంధీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్ పని చేయని విషయాన్ని ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించాం. కాలపరిమితి ముగిసిన గాంధీ క్యాత్‌ల్యాబ్ మరమ్మతులకు రూ. 45 లక్షలు, ఏడాది నిర్వహణకు మరో రూ. 30 లక్షలు అవసరం. రూ.75 లక్షలు వ్యయం చేసే బదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న నూతన క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ విషయాలన్ని నివేదిక రూపంలో అందించగా నూతన క్యాత్‌ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి నిరుపేద హృద్రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఇంటికి రా... నీ పని చెప్తా...
జనవరి 23 శనివారం. ఢిల్లీలో డాక్టర్ కె.కె.అగర్వాల్ టీకా తీసుకున్నారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఢిల్లీలో ప్రముఖ కార్డియాలజిస్ట్. మెడికల్ అసోసియేషన్స్– ఆసియా అధ్యక్షుడు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తుంటారు. తాను కోవిడ్ టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన ఫేస్బుక్ లైవ్ పెట్టారు. టీకాతో భయం లేదని చెబుతున్నారు. ఇంతలో భార్య ఫోన్ మోగింది. ‘ఏంటి... నువ్వు టీకా తీసుకున్నావా?’ అని అడిగారామె. లైవ్ వెళుతోంది. ‘అవును’ అన్నాడీయన. ‘ఇంటికిరా నీ సంగతి చెప్తా’ అందామె. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్ అయిపోయింది. కాని ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ‘నువ్వు లైవ్‌లో ఉన్నప్పుడు నీ భార్య ఫోనెత్తకు’ అని ఇప్పుడు దేశమంతా సందేశం అందుతోంది. దాంతోపాటు డాక్టర్ కె.కె.అగర్వాల్ వీడియో కూడా. ఇదంతా జరిగి ఒక నాలుగైదు రోజులవుతోంది. అసలేం జరిగిందంటే డాక్టర్ కె.కె.అగర్వాల్ ఢిల్లీలో పేరు మోసిన కార్డియాలజిస్ట్. టీవీ పర్సనాలిటీ. పద్మశ్రీ కూడా వచ్చిందాయనకు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన కరోనా అవగాహన వీడియోలు, జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మొన్నటి శనివారం తాను కోవిడ్ వాక్సిన్ తీసుకుంటూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. ‘ఇదిగోండి.. నా వయసు 63. నేను బ్లడ్ థిన్నర్లు వాడతాను. అయినా సరే నేను వాక్సిన్ తీసుకున్నాను. నాకేం కాలేదు. కాబట్టి మీరూ వేయించుకోండి’ అని ఆయన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. భార్య నుంచి. ఆయన లైవ్‌లో ఉండి ఫోన్ ఎత్తాడు. భార్య: ఏంటి... నువ్వు వాక్సిన్ వేయించుకున్నావా? అగర్వాల్: అవును. అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి వెళ్లాను. ఖాళీ ఉంది వేయించుకోండి అంటే వేయించుకున్నాను. భార్య: నన్నెందుకు తీసుకెళ్లలేదు. అగర్వాల్: నీకు సోమవారం వేస్తారు. భార్య: వాక్సిన్ వేయించుకున్నది గాక ఇంకా ఏంటేంటో చెప్తావా... ఇంటికిరా నీ పని చెప్తా... దాంతో అగర్వాల్ గారి ముఖం వాడిపోయింది. ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. భార్యకు ఎంతటివాడైనా భయపడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నిన్న (బుధవారం) డాక్టర్ గారు తన ఫేస్బుక్ వాల్ మీద వీడియో రిలీజ్ చేశారు. ‘నా భార్య కోప్పడటం సబబే. నా ఆరోగ్యం గురించి వర్రీ అయ్యింది. టీకా గురించి అందరికీ సందేహాలు ఉన్నాయి కదా. తను పక్కన ఉన్నప్పుడు వేయించుకోవాల్సింది అని ఆమె ఉద్దేశ్యం. నేనేమో ఆమెకు చెప్పకుండా ఈ పని చేశాను. దీనిని పెద్దగా చర్చ పెట్టాల్సిన పని లేదు’ అన్నాడాయన. అయితే ఈ వెర్షన్‌ను సగంమంది నెటిజన్లు నమ్ముతుంటే అగర్వాల్ ఒక్కడే వెళ్లి అలా టీకా వేయించుకోవడం గురించి ఆమెకు నిజంగా కోపం వచ్చిందని మిగిలిన సగం అన్నారు. ‘అయినా భర్తను అదిలించి అదరగొట్టే శక్తి భార్యకు కాక ఇంకెవరికి ఉంటుంది’ అని మరికొందరు అన్నారు. అగర్వాల్ భార్య పేరు వీణాఅగర్వాల్. ప్రస్తుతం కెకె అగర్వాల్‌తో పాటు ఆమె కూడా అందరికీ తెలిశారని మాత్రం చెప్పక తప్పదు. -
తల్లీబిడ్డ సేఫ్
సాక్షి కథనంపై స్పందించిన ప్రశాంతి ఆస్పత్రి యాజమాన్యం గుండె జబ్బుగల గర్భిణికి ఉచితంగా ఆపరేషన్ రెక్కాడితే డొక్కాడని పేద గిరిజన కుటుంబం వారిది. భర్తతో ఆనందంగా జీవిస్తున్న ఆ మహిళను పిడుగులాంటి వార్త భయాందోళనకు గురిచేసింది. కడుపులో బిడ్డను మోస్తున్న ఆమె హృదయ స్పందనలు నిమిషానికి సాధారణ స్థితిని మించి 167 సార్లు కొట్టుకుంటుండడంతో డెలివరీ చేసేందుకు వైద్యులు వెనుకడుగు వేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దంపతులకు ‘సాక్షి’ అండగా నిలి చింది. ‘హృదయ వేదన’ శీర్షికతో ఆగస్టు 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి హన్మకొండలోని ప్రశాంతి ఆస్పత్రి వైద్యు లు స్పందించారు. నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డను రక్షించారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. న్యూశాయంపేట : గూడూరు మండలం కేశ్యాతండాకు చెందిన వోంకుడోతు మహేందర్, భారతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎలాంటి జబ్బు లేని భారతికి ఒకసారి గుండెనొప్పి వచ్చింది. మహబూబాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకొని మందులు వాడుతోంది. ఈ క్రమంలో మూడో సంతానం కో సం మరోసారి భారతి గర్భం దాల్చింది. వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆమెకు కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందిగా డాక్టర్ సూచించారు. హన్మకొండలో కార్డియాలజిస్టును సంప్రదించగా గుండె మామూలు స్పందన కంటే ఆధికంగా ఉందని, ప్రసవ సమయంలో గుండెనొప్పి వస్తే తల్లీ,బిడ్డకు చాలా ప్రమాదమని చెప్పారు. కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు సమక్షంలో ఆపరేషన్ చేసి ప్రసవం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. తమ దగ్గర అన్ని డబ్బులు లేవని బోరున విలపించిన ఆ దంపతులు ఇంటికి చేరుకున్నారు. అప్పటి వర కు భారతి ప్రసవానికి మరో నెల సమ యం ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి దీనావస్థ గురించి సాక్షిలో ‘హృద య వేదన’ శీర్షికతో ఆగస్టు 4న కథనం ప్రచురితం కాగా హన్మకొండ మచిలీ బజార్‌లోని ప్రశాంతి ఆస్పత్రి యాజ మాన్యం స్పందించింది. ఆ మహిళకు ఉచితంగా వైద్యం అందిస్తామని ముందుకొచ్చింది. రిస్క్‌తో కూడుకున్న పేషెం ట్ను ఆస్పత్రిలో చేర్చుకొని నెల రోజుల పాటు ఉచిత ౖÐð ద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న కార్డియాలజిస్ట్ సిద్ధార్థ ప్రసాద్, గైనకాలజిస్ట్ ప్రశాంతిమోహన్, మహేష్‌కుమా ర్, నిమోటాలజిస్ట్ నిఖిల్కులకర్ణి వైద్యబృందం సమక్షంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను ప్రాణాపా యంనుంచి కాపాడారు.ఎలాంటి ఇబ్బం దులు లేకుండా భారతి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందభాష్పాలు వెల్లివిరిశాయి. సేవా దృక్పథంతో ముందుకొచ్చాం.. సేవా దృకృథంతో ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించామని ప్రశాంతి ఆస్పత్రి చైర్మన్ టి.మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అయినా చాలెంజ్‌గా తీసుకున్నామని తెలిపారు. డబ్బు ఆశతో కాకుండా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రాణభిక్షపెట్టి ఆదుకున్నానన్నారు. సమావేశంలో డాక్టర్లు నిఖిల్కులకర్ణి, మహేష్‌కుమార్ ఉన్నారు. ‘సాక్షి’కి రుణపడి ఉంటాం మాకు అండగా నిలిచిన ‘సాక్షి’ పత్రికకు రుణపడి ఉంటాం. లక్షలు ఖర్చవుతాయనగానే మాకు భయమైంది. గతంతో వైద్యఖర్చుల కోసం ఉన్న రెండెకరాల్లో ఓ ఎకరం అమ్మి వైద్యం చేయించాను. అప్పటికి నా భార్య భారతి బతుకుతుందో లేదో భయం ఉండేది. ప్రశాంతి ఆస్పత్రి డాక్టర్లు దేవుళ్లలా ముందుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేశారు. వారికి, సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాంకుడోతు మహేందర్