తీయని ఫలాల్ని దర్శిస్తాం, చవిచూస్తాం. కానీ ఫలాలుగా మారడానికి ముందు చెట్ల కళ్లు కాయలుగా కాస్తాయి. అంతకు ముందు పిందెల అందాలు చూస్తాం. నేల బిలాలు, జలాలు రసపుష్టి కలిగించ డంలో ఎంతో కృషి ఉంది. ఎంతో భూమిక ఉంది. ఇంతకు ముందే గౌరవ సమ్మాన ఫలాల్ని దర్శించి, రుచి చూసిన గరికిపాటి నరసింహారావును ఇప్పుడు భారత ప్రభుత్వం వారి ‘పద్మశ్రీ’ వరించడం ఆయన నిరంతర సాహిత్య కృషికి ఒక మహాఫల ప్రదానం.
గరికిపాటిలో– నిరంతర విద్యార్థి, బోధకుడు, పరిశోధకుడు, మహాసహస్రావధాని, అసాధారణ ధారణా ధురీణుడు ఉన్నారు. ‘భాష్పగుచ్ఛం, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం’ వంటి కావ్యాల కర్త. కవితా ప్రయోగ శీలి, ఆధ్యాత్మిక ప్రసంగ ప్రవచనకర్త. ఇందరు బహుముఖ ప్రతిభా రూపాలుగా ఉండటం చాలా తక్కువమందిలో ఉంటుంది.
ఆయన ప్రాచీన ఛందో రూపాలైన పద్యాలను ఆధునిక అంశాలతో చెప్పినా, ఉపన్యాసాలలో రొడ్డ కొట్టుడు మూఢ భావాలను చెండాడుతూ సంస్కార భావాలు వెదజల్లినా అందుకు గణనీయ నేపథ్యాలున్నాయి. ఇవి వీరేశలింగం నడయాడిన రాజమహేంద్ర వరంలో ఏర్పడ్డాయి. ఆయన రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పరిశోధన చేశారు.
ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ‘మౌఖిక సాహిత్యం’పై పరిశోధన చేసి రెండు స్వర్ణ పతకాలు పొందారు. ఆ పరిశోధన గ్రంథానికి ‘మౌఖిక సాహిత్యంపై మౌలిక పరిశోధన’ శీర్షికతో అపూర్వ పరిశోధనాంశాలతో ఒక పీఠిక సంతరించారు తిరుమల రావు. నరసింహారావు ఈ గ్రంథం తెలుగులో ఈ విష యమై మొదటి గ్రంథం అని ప్రామాణికతతో చెప్పా రంటే పరిశోధనా పాటవం తెలుస్తుంది. తిరు మల రావుగారితో చర్చలు, ఆయన ఆధునిక శాస్త్రీయ భావాలు గరికిపాటిపై ప్రభావాన్ని చూపాయి.
నరసింహారావు రాసిన భౌతిక మానసిక పర్యా వరణ మహాకావ్యం ‘సాగరఘోష’. ఈ కావ్యానికి ‘తరంగం అంతరంగం’ శీర్షికతో బేతవోలు రామబ్రహ్మం పీఠిక రాశారు. అందులో రాజశేఖరుని ఉటం కిస్తూన్న సందర్భంలో ‘అవధానాలతో ఆగిపోకుండా, అవే మహాకావ్యాలని ఆత్మవంచన చేసుకోకుండా గరికి పాటి ఈ కావ్యరచన చేశారు’ అని మెచ్చుకున్నారు. గరికిపాటి పద్య రచనా శక్తికి ‘సాగరఘోష’ ప్రతి బింబం. ‘ఇది విశ్వకార్యం. భూమి చరిత్రే ఈ కావ్య ఇతివృత్తం’ అన్నారు.
ఒక తరంగ బాలిక ఒక కవి వద్ద సేద తీరుతుంది. కవి కవిత్వంతో లాలిస్తాడు. ఆ కెరటం మేలుకుని అది తిరిగి వచ్చిన సముద్ర తీరాల విశేషాలను చెబుతుంది. మానవుని జీవిత కథ అంతా స్థూలంగా చెబుతుంది. అదే ‘సాగర ఘోష’.గరికిపాటి కవితాశక్తి, భావుకత, సరళ పద్య నిర్మాణ పటుత్వం, ప్రాపంచిక జ్ఞానాంశాలూ ఈ కావ్యంలో ప్రస్ఫుటమవుతాయి.‘సాగర ఘోష’ పర్యావరణ కావ్యం. ఓ పద్యంలో ఓల్గా, టైగ్రిస్, థేమ్స్ మొదలైన నదులు... తమ తీరాలపై పెరిగే కాలుష్యాలను తొలగించేవారే లేరా అని బాధపడుతాయట. ప్రవాహాలకే తమ మౌన వ్యధలు వినిపిస్తాయంటారాయన.
ఓ చిన్న పద్యంలో మనం సముద్రం ‘ఉప్పు’ తిని దానికే ముప్పు చేరుస్తామంటారు. వన్యప్రాణి రక్షణ చేయాలని చెబుతూ లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, కృష్ణ జింకలు వంటి అరుదైన జంతువులు మన మింగుళ్లకు బలి అయిపోతున్నాయని ఆవేదన చెందుతారు.అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర పెట్టే నేర్పు ఉన్న నేత పనులవారి చేతులు తెగకోసిన ఆంగ్లేయుల్ని గరికిపాటి అధములైన ఆంగ్ల వీరులు అని ఎద్దేవా చేస్తారు. మార్పుకోసం, మంచి కోసం, మనిషి కోసం ‘సాగర ఘోష’ రాశానన్నారు గరికిపాటి. ఈ మానవ మార్గం విస్తరిస్తూనే ఉండాలి. గరికిపాటిలోని గుప్త జానపదుడు రచనల ద్వారా దర్శనమిస్తూనే ఉండాలి.
- సన్నిధానం నరసింహశర్మ
వ్యాసకర్త మాజీ గ్రంథాలయ పాలకులు,
శ్రీగౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి
మొబైల్ : 92920 55531
Comments
Please login to add a commentAdd a comment