
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్‌చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.
హేమ్‌చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్‌లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.
హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్‌పూర్‌లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు.