రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించగా.. క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర జజేరియా భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్‌నారాయణ్ మీనన్, ఫసల్‌అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్‌వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది.
దేవేంద్ర ఝఝరియా:
దేవేంద్ర ఝఝారియా ..2004 పారాలింపిక్స్‌లో స్వర్ణం...2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్ స్వర్ణం... ఇది అతని గెలుపు ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.
సొంత డబ్బులు పెట్టుకొనని ఒలింపిక్స్‌కు:
సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి.
ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్‌జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు.
నీరజ్ చోప్రా:
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment