![Neeraj to compete in Diamond League event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/neeraj.jpg.webp?itok=5g5-ii_t)
2025 సీజన్ ప్రారంభించనున్న నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్‌పై అడుగు పెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్ లీగ్ ఈవెంట్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెట్లిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వివరాలు వెల్లడించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నీరజ్ ప్రస్తుతం ప్రాక్టీస్ ప్రారంభించినట్లు రాధాకృష్ణన్ పేర్కొన్నాడు.
ఒక సీజన్‌లో 14 డైమండ్ లీగ్ మీట్‌లు జరగనుండగా... దోహా ఈవెంట్ అందులో మూడోది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్‌లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పోచెఫ్‌స్టోమ్‌లో శిక్షణ పొందుతున్నాడు.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కూడా పోచెఫ్‌స్ట్రోమ్‌లోనే సాధన చేశాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్... 90 మీటర్ల మార్క్ దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment