జ్యూరిచ్: అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణంతోనే తాను ఆగిపోనని చాటుతూ ఆపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం అందుకున్న అతను... ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో సత్తా చాటిన అతను 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వాలెచ్ (86.94 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, జూలియన్ వెబర్ (ఇంగ్లండ్)కు మూడో స్థానం దక్కింది. విజేతగా నిలిచిన నీరజ్‌కు డైమండ్ ట్రోఫీతో పాటు 30 వేల డాలర్లు (సుమారు రూ. 24 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది.
ఎదురు లేని ప్రదర్శన...
గాయం కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు దూరమైన నీరజ్ గత నెల 26న లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ అంచెలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు 2023లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు. గురువారం ఈవెంట్‌లో నీరజ్ తొలి ప్రయత్నం ‘ఫౌల్’ అయింది. అయితే రెండో ప్రయత్నంలో అతని జావెలిన్ 88.44 మీటర్లు దూసుకుపోయింది. తర్వాతి మరో నాలుగు ప్రయత్నాల్లోనూ (88 మీ., 86.11 మీ., 87 మీ., 83.60 మీ.) దీనికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా... విజేతగా నిలిచేందుకు 88.44 మీటర్లు సరిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment