నేడు లుసాన్ డైమండ్ లీగ్ మీట్
లుసాన్ (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఈవెంట్‌కు సిద్ధమయ్యాడు. డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా నేడు లుసాన్ మీట్‌లో నీరజ్ బరిలోకి దిగుతున్నాడు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:10 నుంచి నీరజ్ ఈవెంట్ మొదలవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లలో పాకిస్తాన్ అథ్లెట్, స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ మినహా మిగిలిన ఐదుగురు లుసాన్ మీట్‌లో ఉన్నారు. స్పోర్ట్స్–18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో నీరజ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
డైమండ్ లీగ్‌లో భాగంగా మొత్తం 14 మీట్‌లు జరుగుతాయి. అయితే జావెలిన్ త్రో మాత్రం నాలుగు మీట్‌లలోనే నిర్వహిస్తారు. ఇప్పటికే దోహా, పారిస్ అంచెలు ముగిశాయి. లుసాన్ మీట్ తర్వాత జ్యూరిచ్‌లో (సెపె్టంబర్ 5న) చివరిదైన నాలుగో అంచె జరుగుతుంది. అనంతరం ఈ నాలుగు మీట్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్–6లో నిలిచిన వారు సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్‌లో జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
ఈ సీజన్‌లో దోహా మీట్‌లో మాత్రం పాల్గొని రెండో స్థానంలో నిలిచిన నీరజ్ ప్రస్తుతం 7 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. లుసాన్ మీట్‌లో మొత్తం 10 మంది జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. మొత్తం ఆరు అవకాశాలు ఇస్తారు. తొలి మూడు ప్రయత్నాలు ముగిశాక చివరి రెండు స్థానాల్లో నిలిచిన వారు నిష్క్రమిస్తారు.
మిగిలిన ఎనిమిది మంది ఆరు త్రోలను పూర్తి చేస్తారు. టాప్–8లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 8,7,6 పాయింట్లు లభిస్తాయి. అనంతరం 4,5,6,7,8 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 5,4,3,2,1 పాయింట్లు కేటాయిస్తారు. డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో మాత్రమే పతకాలను అందజేస్తారు. ఈ సీజన్‌లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పోటీపడ్డ ఐదు ఈవెంట్స్‌లోనూ కనీసం టాప్–2లో నిలిచాడు.
గతంలో 2022లో డైమండ్ లీగ్ విజేతగా
నిలిచిన 26 ఏళ్ల నీరజ్.. గత ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల గాయంతోనే ‘పారిస్’ క్రీడల్లో బరిలోకి దిగిన నీరజ్.. సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో రజతం చేజిక్కించుకున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్.. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
విశ్వక్రీడలు ముగియగానే స్వదేశానికి కూడా తిరిగిరాని నీరజ్‌చోప్రా.. నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ‘ఒలింపిక్స్ ముగియగానే... డైమండ్ లీగ్ సన్నాహాలు ప్రారంభించా. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. గాయం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. మరో నెల రోజులైతే సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తా’ అని నీరజ్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment