గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్‌లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
పట్టుదలే పద్మభూషణ్ వరకూ...
అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు.
చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్‌లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.
‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్‌కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్‌లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
యాక్టివ్‌గా యాక్టింగ్
ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.
కొత్త పంథాకి భూషణం
శేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు.
‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...
‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది.
భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
స్టయిల్ మార్చేశారు
ఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.
బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులు
చంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత
ఆమె కెరీర్ శోభాయమానం
కేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.
మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.
నటసింహ కీర్తి కిరీటంలో...
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.
‘సాహసమే జీవితం’తో హీరోగా
1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన.
50 ఏళ్ల నట ప్రస్థానంలో...
‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్‌ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.
బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment