అరటి తోటలో పాపమ్మాళ్
కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్న విషయం తెలిసిందే. దీనికున్న మరో విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. ఈ విద్యాసంస్థ ఏభయ్యేళ్ల క్రితం నుంచే ‘రైతులకు సేంద్రియ వ్యవసాయా’న్ని నేర్పిస్తూ ఉంది! అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104 ఏళ్ల పాపమ్మాళ్!! రసాయనిక రైతుగా 30 ఏళ్ల వ్యవసాయానుభవం తర్వాత.. 50 ఏళ్ల క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘సేంద్రియ వ్యవసాయం’ నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ ‘మహా రైతమ్మ’ను పద్మశ్రీ పురస్కారం వరించింది.ఆమెను ‘సాక్షి’ పలుకరించింది..
తోట పనిలో పాపమ్మాళ్
మీరు వ్యవసాయంలోకి మీరెలా వచ్చారు?
పొట్ట కూటి కోసం ఎంతకష్టమైనా పడకతప్పదు. 1914లో పుట్టాను. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నాను. నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదువు మానేశాను. 20 ఏళ్లకే పెళ్లయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే నా పిల్లలుగా చేరదీశాను. పొదుపు చేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగాను. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం అరటి పంట పెట్టా.
సేంద్రియ సాగు ఎప్పటి నుంచి..?
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. ఆ సమావేశాలకు హాజరైనపుడు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే రసాయన ఎరువులు, పురుగుమందులతో ఇన్నాళ్లూ సేద్యం చేశానా? అని బాధపడ్డాను. సేంద్రియ వ్యవసాయంలోకి మారి 50 ఏళ్లు గడిచింది. దేశవాళీ విత్తనాలు సేకరించేదాన్ని. జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, కందులు పండించే దాన్ని. ఇపుడు అరటి సాగు చేస్తున్నా.
సేంద్రియ వ్యవసాయంలో మీ ప్రత్యేకత ఏమిటి?
ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెడతాను. 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెడతాను. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లుతాను. వేపాకును ఎండ బెట్టి పొడి చేసి, వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పట్టదు.
సేంద్రియ రైతుగా మీ అనుభూతి ఎలా ఉంది?
ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి. సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి.
పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వటం ఎలా అనిపిస్తోంది?
పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు, బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నాను.
మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?
తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్లు తోముతాను. కాలకృత్యాలు ముగించుకుని (టీ, కాఫీ తాగను) ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు, రాగి గంజి తాగుతాను. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తాను. అరటి ఆకులోనే భోజనం చేస్తాను. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే నా భోజనం. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎప్పుడైనా కొద్దిగా తింటాను. ఉదయం 5.30–6 గంటల కల్లా చేలో ఉంటాను. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బొండాం, సాయంత్రం మళ్లీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్థోమత నాకు లేదు. అందుకే నాటి నుంచి నేటి వరకు నేనే పొలం పని చేస్తాను. సోదరి, మనుమలు, మనుమరాళ్లు అప్పుడప్పుడూ పనిలో సాయం చేస్తారు. సాయంత్రం చీకటì పడే వరకు పొలం దగ్గరే ఉంటాను. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం అనుకుంటాను.
– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment