‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల.
సిరి శక్తి
సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం.
అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది.
‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే.
కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది.
Comments
Please login to add a commentAdd a comment