డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు.
‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.
నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు.
డైరెక్షన్ మారింది
తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి.
ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్‌తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్‌లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్‌లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది.
Comments
Please login to add a commentAdd a comment