‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్‌పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్‌ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు.
దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్‌లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్‌ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్‌ఎంఓ లిమిటెడ్.. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది.
శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్‌ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి.
పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్‌లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment