పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్, చిత్రంలో వెంకయ్యనాయుడు, చిరంజీవి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, జూపల్లి, సీఎస్ శాంతికుమారి తదితరులు
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు.
పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు.
మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు.
విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్‌మెంట్‌తో ఆయన ఉన్నారని కొనియాడారు.
కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు.
కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి
ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment