Award recipients
-
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాల విజేతలు వీరే... డాక్టర్ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డాక్టర్ వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి. ప్రసాద్ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాల సాహిత్యం), డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డాక్టర్ పసునూరి రవీందర్(కథ), వేముల ప్రభాకర్(నవల), ఆర్.సి.కృష్ణస్వామిరాజు (హాస్య రచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధరగౌడ్(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డాక్టర్ వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్.వి.రామారావు (పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికారచన), రాళ్లపల్లి సుందర్రావు(భాష), ఘట్టమరాజు అశ్వత్థామనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబ (లలిత సంగీతం), డాక్టర్ కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జానపద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డాక్టర్ పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయిత్రి), శైలజామిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమనటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు) ప్రొఫెసర్ భాస్కర్ శివాల్కర్ (నాటక రంగంలో కృషి), పేరిణి ప్రకాశ్(పేరిణి), డాక్టర్ రుద్రవరం సుధాకర్(కూచిపూడి నృత్యం), డాక్టర్ గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువాద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుదయం), డాక్టర్ ముదిగంటి సుధాకర్‌రెడ్డి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్ (ఇంద్రజలం), నారు (కార్టూనిస్ట్), డాక్టర్ ఎ.ఎస్.ఫణీంద్ర (జ్యోతిషం), ఎజాజ్ అహ్మద్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం) తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29వ తేదీలలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నేలమ్మ
ఆమె ఒక విత్తన గని. భారతదేశ ధాన్య సంపదను పరిరక్షించిన దేశభక్తురాలు. నేలను నమ్మిన భూమాత. మట్టిని గౌరవించిన దేశమాత. సస్యాన్ని కాపాడిన ప్రకృతి తల్లి. అందుకే... ఆమెను గౌరవించడం ద్వారా మనందరి గౌరవాన్ని పెంచింది మన భారతదేశం. మార్చి 16వ తేదీన రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాలకు వేదికైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందచేస్తున్నారు. మహామహులు అందుకునే పురస్కారాల్లో ఈ ఏడాది పద్మాలు ఎవరో చూడాలని టీవీల ముందు కూర్చుంది ఇండియా. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రొటోకాల్ గౌరవాలందుకుంటూ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ముందుకు వస్తున్నారు. ‘కమలా పూజారి, వ్యవసాయరంగం’ అని వినిపించింది. ఒక బక్క పలుచటి మహిళ, డెబ్బై ఏళ్లు నిండిన మహిళ, ఒడిషా రాష్ట్రానికి చెందిన భూమియా ఆదివాసీ మహిళ... రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తోంది. ఒడిషా ముతక చేనేత చీరను మడమల పైకి కట్టుకుంది. పాదాలకు స్లిప్పర్స్. భుజాల మీద శాలువా ఉంది. శాలువా ఆమెకు అలవాటున్న వస్త్రధారణలా లేదు. జారిపోతున్న శాలువాను సర్దుకుంటూ రాష్ట్రపతి ఎదురుగా మెరిసే కళ్లతో నిలబడిందామె. దేహం బలహీనంగా ఉంది, ఆమె కళ్లలో ధైర్యం బలంగా ఉంది. పద్మశ్రీ పురస్కారాన్ని మనసారా స్వీకరించడానికి సిద్ధంగా ఉందామె. భావి తరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నందుకు రాష్ట్రపతి కూడా సంతోషిస్తున్నారు. విత్తనానికి భవిష్యత్తు కమలా పూజారిది ఒడిషా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పత్రాపుట్ గ్రామం. ఆమె ఏమీ చదువుకోలేదు. స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరిదీ ఒకటే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే ఆమెకి తెలిసింది. అది కాకుండా ఆమెకి తెలిసిన మరో సంగతి.. మన నేల మనకిచ్చిన వంగడాలను కాపాడుకోవాలని మాత్రమే. అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. అలా ఇప్పటి వరకు వందకు పైగా విత్తనాల రకాలున్నాయి ఆమె దగ్గర. అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. తెగుళ్ల నుంచి వాటిని అవే కాపాడుకుంటాయి. రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదు. ‘మా విత్తనాలు కొనండి, అధిక దిగుబడిని సాధించండి’ అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ సాగవు ఆమె దగ్గర. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. దేశీయతను పరిరక్షించడం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే ఆమె సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, డీ జనరేషన్ విత్తనాలు రాజ్యమేలుతూ, ఎరువుల కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో... భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచి పెట్టింది కమలా పూజారి. అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి ప్రణమిల్లింది. స్వామినాథన్ వదిలిన బాణం దాదాపు పాతికేళ్ల కిందట... ఒడిషాలోని జేపూర్ పట్టణంలో ఉన్న ఎమ్.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆ సదస్సుకు హాజరైన రైతు మహిళల్లో కమలాపూజారి కూడా ఉన్నారు. ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను తదేకంగా గ్రహించడంతోపాటు ఆచరణలోనూ పెట్టింది. పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అయితే ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటలనే పండించాలని తెలుసుకున్నారు. మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నదే. కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్నీ దాచి ఉంచడం, సేంద్రియ వ్యవసాయం చేయమని పదిమందికి తెలియ చెప్పడం. వాడ వాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని తెలియ చెప్పడంతోపాటు రసాయన ఎరువులను బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల. పత్రాపూట్లో తన ఊళ్లో ఇంటింటికీ తిరిగి చెప్పారు. పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు. కోరాపూట్ పక్కనే ఉన్న నబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు ఆమె బాట పట్టాయి. గ్రామస్థులను సమీకృతం చేసి, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ (సీడ్ బ్యాంక్) నెలకొల్పారు కమల. రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి. డీ జర్మినేషన్ గింజల వెంట పరుగెత్తకుండా జర్మినేషన్ సీడ్‌ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం, అవార్డుల పంట సేంద్రియ పంటతోపాటు కమలాపూజారికి అవార్డుల పంట కూడా వరించింది. స్వామినాథన్ ఫౌండేషన్ 2002లో సౌత్ ఆఫ్రికా, జోహాన్నెస్ బర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విశేషమైన ప్రశంసలందాయామెకి. ‘ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు’తో గౌరవించిందా సదస్సు. ఆ తర్వాత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారిని ‘కృషి విశారద’ బిరుదును ప్రదానం చేసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ‘ఒడిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ’ 2004లో కమలాపూజారిని ‘ఉత్తమ మహిళా రైతు’ పురస్కారంతో గౌరవించింది. కమలా పూజారి గౌరవార్థం ఆ యూనివర్శిటీలో గాళ్స్ హాస్టల్‌కు ఆమె పేరు పెట్టింది. అంతే కాదు... ఆ హాస్టల్ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగా చేయించింది ప్రభుత్వం. అలాగే జేపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా ఆహారం పెట్టే ‘రాత్రి ఆహార్ కేంద్ర’ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. గౌరవాలున్నాయి.. గూడే లేదు ఒడిషాలో ప్రభుత్వం రైతు సదస్సు నిర్వహిస్తే, ఆ సదస్సులో పాల్గొనవలసిందిగా కమలా పూజారికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. సన్మానమూ ఉంటుంది. మహిళాదినోత్సవం రోజున కూడా పురస్కరించుకోవడానికి స్థానిక అధికారులకు మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి కమలా పూజారి. అయితే ఆమెకు నిలవ నీడ కల్పిద్దామనే ఆలోచన మాత్రం ఏ అధికారికీ రాలేదు. ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అందుకోవడానికి అవసరమైన ప్రధాన అర్హత పేదరికం. ఆమెను చూస్తే పేదరికంలో మగ్గుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విఆర్వో ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదు. పేదరికం ఆమె ఒంటి మీద తాండవిస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వమని ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చారామె. ఇవ్వగా ఇవ్వగా ఆఖరుకి ఆమెకి గవర్నమెంట్ కట్టించి ఇచ్చిన ఇంటికి కరెంటు లేదు, కనీసం కిటికీ కూడా లేదు. ఏ మాత్రం ఆవాసయోగ్యంగా లేని ఇంట్లో ఉంటోందామె. గవర్నర్ ఆహ్వానం గత ఏడాది ఒడిషా ప్రభుత్వం కమలాపూజారిని స్టేట్ ప్లానింగ్ బోర్డు మెంబరుగా నియమించింది. ఈ బోర్డులో ఒక ఆదివాసీ మహిళకు స్థానం లభించడం మొదటిసారి. ప్లానింగ్ బోర్డు మెంబరు హోదాలో వచ్చిందా, ఆదర్శ రైతు మహిళగా ఆహ్వానం వచ్చిందో ఆమెకు తెలియదు... కానీ, స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి గత ఏడాది ఆమెకు ఆహ్వానం వచ్చింది. అది నిజానికి అత్యంత గౌరవపూర్వకమైన ఆహ్వానం. విశిష్ఠ వ్యక్తులకు మాత్రమే అందే ఆహ్వానం. అయితే తన ఊరి నుంచి రాజధానికి వెళ్లడానికి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో హాజరుకాలేకపోయారు కమల. అప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి పరిశీలన చేయనేలేదు. పత్రాపుట్ వాసులైతే ‘ఆమెను ప్లానింగ్ బోర్డులో నియమించడం అంటే ఆమెను గౌరవించడం కాదు, ఆమె పేదరికాన్ని పరిహసించడమే’ అని ప్రభుత్వ తీరును నిరసించారు. ఆమె మాత్రం ‘ప్లానింగ్ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరిగినా వెళ్లి మా ఊరికి తాగు నీటి సౌకర్యం కోసం మాట్లాడతాను’ అని చెప్పారు తప్ప తనకోసం ఏదైనా అడుగుతానని అనలేదు. పరమానందం కమలా పూజారిలో గొప్పదనం ఏమిటంటే... ఆమె పేదరికం గురించి ఊరంతా ఆవేదన చెందుతున్నప్పటికీ ఆమె మాత్రం తన పేదరికాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దేశం తనను ఇంత పెద్ద పురస్కారానికి ఎంపిక చేసినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేశారామె. ఊరి వాళ్లు మాత్రం... ‘‘అత్యంత పేదరికాన్ని అనుభవిస్తోంది. అత్యంత ఉన్నతమైన వేదికల మీద పురస్కారాలను అందుకుంటోంది. పురస్కారం అందుకుని వచ్చిన మరుసటి రోజు నుంచి తిరిగి పొలం పనులకు పోతుంది ఎప్పటిలా’’... అని ఆమెను సగౌరవంగా తలుచుకున్నారు. ఆమె సేవలను ప్రభుత్వం సగర్వంగా చాటుకుంటోంది. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించుకుంటోంది. అంతటి విలువైన సేవలందించిన కమలాపూజారికి పద్మశ్రీ ప్రదానం చేయడం వల్ల పెరిగింది ఆమె గౌరవం కాదు... దేశ గౌరవమే. – వాకా మంజులారెడ్డి రీసెర్చ్ బ్యాంక్ భవిష్యత్తు వ్యవసాయరంగానికి మార్గదర్శనం చేస్తున్న మహిళ కమలా పూజారి. సుస్థిరమైన, నిరంతరాయమైన అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవ వ్యవసాయ రంగానికే మార్గదర్శనం. మనదేశీయ పంటల నిధిని భావితరాల కోసం భద్రపరిచిన ముందు చూపున్న తల్లి కమలా పూజారి అని దేశం ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. వరిలో రకాలు, పసుపు, నువ్వులు, నల్ల జీలకర్ర, రకరకాల చిరుధాన్యాలు, మహాకంత, ఫూలా వంటి ఆరతడి పంటల విత్తనాలు, నీటి పంటలు గింజలు ఆమె సేకరణలో ఉన్నాయి. ఆమె సేకరించిన సీడ్ బ్యాంకులో అంతరించిపోతున్న అనేక రకాల ధాన్యం గింజలున్నాయి. ఆ గింజలను మొలక కట్టి, నారు పోసి ఆ మొక్కలు, పంటల దిగుబడి మీద పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మనుమడి ఆవేదన కమలా పూజారికి చాలా కాలం కిందటే భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనుమలతో జీవిస్తోంది. ఆమెకు ఒక్కో పురస్కారం రావడం, మీడియా ప్రతినిధులు వచ్చి కామెంట్ తీసుకోవడం ఆ ఇంటికి పరిపాటి అయిపోయింది. ప్లానింగ్ బోర్డు మెంబరు అయినప్పుడు ‘ఈ పదవి కంటే ఆమెకు గట్టి ఇల్లు ఇవ్వవచ్చు కదా’ అని వాపోయాడు 12వ తరగతి చదువుతున్న ఆమె మనుమడు సుదామ్ పూజారి. పోయినేడాది వరకు కూడా నాలుగు మట్టి గోడలు, తాటాకు పైకప్పు ఆమె ఇల్లు. ‘‘మా నానమ్మను పెద్ద పెద్ద బిల్డింగులను ప్రారంభించడానికి పిలుస్తారు. ఆమెకు చిన్న ఇల్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదు ప్రభుత్వం. ఆమె ఇందిరా ఆవాస యోజన కింద పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది. అయినా ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎండాకాలంలో నేల మీద నీళ్లు చల్లుకుని పడుకుంటోంది’’ అని గత ఏడాది మీడియా ముందు ఆవేదన చెందాడతడు. ప్రభుత్వం ఆమెకు కిటికీ కూడా లేని గూడునైనా ఇచ్చింది మనుమడి మాట మీడియాలో వచ్చిన తరవాతనే. -
తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే
నాంపల్లి : తెలుగు సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లోని నాట్యం, నాటకం, అవధానం, పత్రికా రచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిష్యం, కార్టూన్, గజల్ తదితర రంగాల్లో విశేషమైన సేవలందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యశస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైన వారిలో దేవులపల్లి కృష్ణమోహన్ (సృజనాత్మక సాహిత్యం), సయ్యద్ నసీర్ అహ్మద్ (పరిశోధన), పులిగడ్డ విశ్వనాథరావు (హాస్య రచన), హైమావతి భీమన్న (జీవిత చరిత్ర), జ్వలిత (ఉత్తమ రచయిత్రి), హెచ్.కె.వందన (ఉత్తమ నటి), సత్కళా భారతి సత్యనారాయణ (ఉత్తమ నటుడు), అత్తలూరి విజయలక్ష్మి (ఉత్తమ నాటక రచయిత), భూపతి నారాయణమూర్తి (హేతువాద ప్రచారం), తంగెళ్ళ శ్రీదేవి (ఉత్తమ రచయిత్రి), దాసరాజు రామారావు(వచన కవిత/గేయ కవిత), నోముల సత్యనారాయణ (వివిధ ప్రక్రియలు) తెలకపల్లి రవి (పత్రికా రచన), చెంచు సుబ్బయ్య (అవధానం), సుమిత్ర అంకురం (మహిళాభ్యుదయం), ఆచార్య రామారెడ్డి (గ్రంథాలయ కర్త), ఆచార్య చంద్రÔó ఖర రావు( గ్రంథాలయ సమాచార విజ్ఞానం), విహారి (కథ), గంగోత్రి సాయి (నాటక రంగం), డాక్టర్ సజ్జాద్(సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), వి.రమణి( ఆంధ్రనాట్యం), జాతశ్రీ(నవల), ఆచార్య బి.రామకృష్ణారెడ్డి( భాషాచ్ఛంద స్సాహిత్య విమర్శ), శింగారపు ఓదెయ్య(జానపద కళలు), బూర్గుల శ్రీనాథ శర్మ (ఆధ్యాత్మిక సాహిత్యం), పల్లేరు వీరాస్వామి (సాహిత్య విమర్శ), వెలుదండ సత్యనారాయణ (పద్యం), పద్మ మోహన్ యాదగిరి (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), పి.వి.అరుణాచలం(జనరంజక విజ్ఞానం), సి.నాగేశ్వర రావు(జానపద గాయకులు), వి.ఆర్.శర్మ (బాలసాహిత్యం), విశ్వనాథ్ జోషి (ఇంద్రజాలం), జి.యాదగిరి (పద్య రచన), పాప(కార్టూనిస్ట్), ఎ.శారదారెడ్డి (లలిత సంగీతం), రేవతి రత్నస్వామి( శాస్త్రీయ సంగీతం), ఆచార్య సివిబి.సుబ్రహ్మణ్యం (జ్యోతిషం), దాశరథుల బాలయ్య (తెలుగు గజల్), నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం) ఎంపికయ్యారు. ఈ నెల 30, 31వ తేదీల్లో హైదరాబాదులోని పబ్లిక్‌గార్డెన్స్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి తెలిపారు. -
రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం
32 రంగాల్లో 50 మందికి పురస్కారాలు ఇవ్వనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారిని ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఒక్కొక్కరికీ లక్షా నూటపదహార్ల నగదు, జ్ఞాపికలతో సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 32 రంగాలకు సంబంధించి 50 మంది ప్రతిభావంతులు, సంస్థలు, ప్రాంతాలను ఎంపిక చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ రెండుమార్లు సమావేశమై ఈ ఎంపికలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందించింది. సాంస్కృతికశాఖ వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలను శనివారం ఉత్తర్వు ద్వారా విడుదల చేసింది. పురస్కారగ్రహీతలు వీరే.. సాహితీవేత్తలు: ముదిగొండ వీరభద్రయ్య(హైదరాబాద్), గూడ అంజయ్య(హైదరాబాద్), సుంకిరెడ్డి నారాయణరెడ్డి(నల్లగొండ జిల్లా), పోల్కంపల్లి శాంతాదేవి(మహబూబ్‌నగర్ జిల్లా), పెద్దింటి అశోక్‌కుమార్(కరీంనగర్ జిల్లా), సలావుద్దీన్ నయ్యర్(హైదరాబాద్) వేదపండితులు: కె.పాండురంగాచార్య(హైదరాబాద్) సంస్కృత పండితులు: ఆచార్య నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు(వరంగల్) అర్చకులు/ఆధ్యాత్మికవేత్తలు: గోపన్నగారి శంకరయ్య(స్థానాచార్యులు-వేములవాడ), ఆర్చ్ బిషప్ తుమ్మబాల(హైదరాబాద్), మహమ్మద్ ఉస్మాన్(ఇమాం- మక్కా మసీదు) ప్రభుత్వ లోగో రూపకర్త: ఏలె లక్ష్మణ్(హైదరాబాద్), అమరవీరుల స్తూప నిర్మాత: ఎక్కా యాదగిరిరావు(హైదరాబాద్) కళాకారులు: కె.లక్ష్మాగౌడ్(హైదరాబాద్), చుక్కా సత్తయ్య(వరంగల్), కళాకృష్ణ(హైదరాబాద్), అలేఖ్య పుంజాల(హైదరాబాద్), జర్నలిస్టు: టంకశాల అశోక్(హైదరాబాద్) ఎలక్ట్రానిక్ మీడియా: డా.పసునూరి రవీందర్(హైదరాబాద్), సంగీతకారులు: హైదరాబాద్ బ్రదర్స్, విఠల్‌రావు(గజల్ గాయకుడు- హైదరాబాద్), జి.ఎల్.నామ్‌దేవ్(ఉద్యమ సంగీతం-కరీంనగర్) న్యాయకోవిదులు: సుధాకర్‌రెడ్డి గ్రామ పంచాయతీ: చందుర్తి, కరీంనగర్ జిల్లా ఉత్తమ మండలం: సిద్దిపేట, మెదక్ జిల్లా శాస్త్రవేత్త: డా.సి.హెచ్.మోహన్‌రావు ఎంటర్ప్రెన్యూర్: నర్రా రవి విద్యావేత్త: ప్రొ. శ్రీధరస్వామి(వరంగల్) క్రీడాకారులు: ముఖేశ్(రంగారెడ్డి జిల్లా), ముళినీరెడ్డి(హైదరాబాద్) వైద్యులు: డా.రాజారెడ్డి(హైదరాబాద్), డా. ఆర్.లక్ష్మణమూర్తి(వరంగల్) ఎన్జీవో: దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్(హైదరాబాద్) ఫొటోగ్రఫీ: భరత్ భూషణ్ (హైదరాబాద్) హస్తకళలు: అయల అనంతాచారి(పెంబర్తి-వరంగల్) చేనేత: కందకట్ల నర్సింహులు(హైదరాబాద్) అంగన్వాడీ: ఇ.పద్మ(కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు) ఉద్యమ గాయకులు: మాటల తిరుపతి, యోధన్(ఆదిలాబాద్ జిల్లా) ఉద్యమ గాయకురాలు: భూక్యా సుశీల శిల్పి: ఎం.వి.రమణారెడ్డి(మెదక్ జిల్లా), ఉపాధ్యాయులు: ఎన్.విజయశ్రీ(జీపీహెచ్ఎస్ నాదర్గుల్ -రంగారెడ్డి), బండా ప్రతాపరెడ్డి(సీనియర్ లెక్చరర్-పాలిటెక్నిక్ మాసబ్‌ట్యాంక్) ప్రభుత్వ ఉద్యోగి: బి.పద్మారావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ(వరంగల్) వారసత్వ కట్టడాల పరిరక్షణ: పి.అనూరాధారెడ్డి(హైదరాబాద్), డా. ఎం.పాండురంగారావు (వరంగల్) చరిత్ర పరిశోధన: డా. జై శెట్టి రమణయ్య(కరీంనగర్ జిల్లా) ఉత్తమ రైతు: కర్ర శశికళ(దుగ్గేపల్లి, త్రిపురారం-నల్లగొండ జిల్లా), వొల్లాల రమేశ్(భీమదేవరపల్లి-కరీంనగర్ జిల్లా పాడిపరిశ్రమ). ఉత్తమ మున్సిపాలిటీ: మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా.