టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం.
సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు.
2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment