పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మానం సభ నేడు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను దక్కించుకున్న వారందరినీ సత్కరించి గౌరవించింది. అందులో భాగంగా నేడు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది.
ఈ సభలో చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు లేదు. కానీ ఆ తర్వాత ఎంతో మంది ప్రతిరోజు నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు సంతోషం కలిగింది. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం. గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇవ్వడం శుభ శూచకం. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మవిభూషన్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉంది. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోదీదే.. దీనిని ఎవరైనా అభినందించాల్సిందే.
నరేంద్ర మోదీ పట్ల నాకు అత్యంత గౌరం వుంది. కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానిని. ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విమర్శలు తగవు... ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టే విధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగవచ్చేనే పరిస్థితి నేడు ఉంది.' అని చిరంజీవి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment