
ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు?
1977. మామ మంచి ఊపు మీద ఉన్నాడు. హార్మోనియం అందుకుని నోటి నిండా తాంబూలంతో పాట చేశాడు. అది ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అయ్యింది. కోటి రూపాయల పాట. హిట్. చక్రవర్తి కూడా తక్కువ దూకుడు మీద లేడు. మద్రాసు విజయ గార్డెన్స్‌లో చేతి మీద చేతి చరుపు వేసి ఒక ట్యూన్ చేశాడు. అది ‘గుడివాడ వెళ్లాను’ అయ్యింది. అదీ మోత మోగిన పాటే. ఆ సమయంలోనే తమిళం నుంచి ఒక సంగీతకారుడు తెలుగులో ఒక లాలిపాట వలే మెల్లగా దోగాడుతూ వచ్చాడు. సుశీలతో, ఏసుదాసుతో పాట చేశాడు.
చిన్ని చిన్ని కన్నయ్య... కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను... నేను మేను మరిచేను... తెర మీద కాగితాలు చించి ఎగరేసే హీరోల పాటల మధ్య ఈ పాటను తెలివైనవాళ్లు గమనించారు. పాటలను గ్రహించేవారు పరిశీలించారు. మెలోడీని ఇష్టపడేవారు ఈ పేరును తమ డైరీల్లో రాసుకున్నారు. ఇళయరాజా! కాని ఈ తమిళుడికి వెంటనే ఇక్కడ ప్రవేశం లభించలేదు. ఇంకో తమిళ రీమేక్ నుంచే అతణ్ణి తెలుగువారు వినాల్సి వచ్చింది. 1978. ‘వయసు పిలిచింది’. ‘ఇలాగే ఇలాగే సరాగ మాడితే’... అందులో శ్రీప్రియ చెప్పినట్టుగానే ఇది ‘లవ్‌లీ సాంగ్’. కాని మనుషుల దృష్టి మాత్రం ఇందులోని రాత్రి పాట మీద పడింది. కోరిక పాట మీద. తాపం పాట మీద. నిప్పును రగిల్చే పాట మీద. ‘మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరలా నిలిచిందిలే’.
ఇప్పుడు నేల క్లాసు శ్రోత కూడా ఆ సంగీత దర్శకుని పేరు తన చేతి మీద బాల్‌పాయింట్ రీఫిల్‌తో రాసుకున్నాడు. ఇళయరాజా! అప్పటికి తెలుగు ప్రేక్షకులందరూ కంటి మీద చేతులు మూసుకొని ఈ దర్శకుని పాట వొడ్డు మీద నిలుచుని ఉన్నారు. పాదాలకు ఇసుక తగులుతోంది. కాలువ కావచ్చు. డొంక కావచ్చు. వంక కావచ్చు. ఊట కావచ్చు. దొరువు కావచ్చు. చెరువు కావచ్చు. 1981. ‘సీతాకోక చిలుక’ వచ్చింది. ‘మిన్నెటి సూరీడు వచ్చెను మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా’.... ‘మాటే మంత్రము మనసే బంధము’... ‘సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే’... అప్పటికి అర్థమైంది. కళ్లు తెరిచారు.
ఎదురుగా సముద్రం. పోటెత్తే సముద్రం. పోటు మీద ఉన్న సముద్రం. పల్లవి వెంట చరణాలుగా విరిగి పడుతున్న సముద్రం. ఈసారి మర్చిపోకుండా ఆ సంగీత దర్శకుడి పేరును అందరూ ఛాతీల మీద రాసుకున్నారు. ఇళయరాజా! తెలుగు సినిమా సంగీతానికి ఒక లలిత సంగీత స్వభావం ఉంది. ఆ మాటకొస్తే తమిళ సినీ సంగీతానికి కూడా ఒక సంప్రదాయ లలిత సంగీత స్వభావం ఉంది. ఈ సంగీత దర్శకుడు అది మార్చాడు.
ఎలా మార్చాడు? పుట్టి పెరిగిన మారుమూల తమిళపల్లె పణై్ణపురంలో విన్న జానపద గీతాన్ని, సంగీతం నేర్చుకోవడానికి మద్రాసులో అభ్యసించిన పాశ్చాత్య గీతాన్ని కలిపి ఒక ఫ్యూజన్‌తో మార్చాడు. కీబోర్డుతో వేణువు కలిసింది. రిథమ్ బాక్స్‌తో వీణ పలికింది. గిటార్‌తో నాదస్వరం జత కట్టింది. సన్నాయి, ట్రంపెట్ ఒక జోడి. ఇలా కలిపినవాడు ఇంతకుముందు లేడు. అది వీడే. జనం పదే పదే ఆ పేరు తలిచి మురిసిపోయారు. ఇళయరాజా! తెలుగులో టేస్ట్ ఉన్న డైరెక్టర్లకు ఇళయరాజా పట్టాడు. బాపుగారు ‘మంత్రిగారి వియ్యంకుడు’ అన్నారు.
ఇతను ‘ఏమనినే చెలి పాడుదును’ అని ఒక పొగమంచు స్పర్శలాంటి యుగళగీతం ఇచ్చాడు. వంశీ ‘సితార’ అన్నాడు. ఇతను ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే’ ఒక మైనాను పలికించాడు. కాని ఇతడిని కమర్షియల్ సినిమాకు దగ్గర చేసింది మాత్రం కె.ఎస్.రామారావు, చిరంజీవి, ఏ. కోదండరామిరెడ్డి త్రయం. మొదటి సినిమా ‘అభిలాష’. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’... ‘బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే’... రాధిక మెరుపు... చిరంజీవి ఒడుపు... ఇళయరాజా నలుపు... నలుపు నారా యణమూర్తే గదా.
ఒక వైపు వీళ్ల కాంబినేషన్‌లోని ‘ఛాలెంజ్’, ‘రాక్షసుడు’, ‘మరణ మృదంగం’ వంటి సినిమాలు వస్తుంటే మరోవైపు వంశీ కాంబినేషన్‌లో ‘ఆలాపన’ , ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడిస్ టైలర్’, ‘మహర్షి’, ‘అన్వేషణ’ లాంటి సినిమాలు ఇతని పాటల్ని తెలుగు నేల మీద ఎనిమిది మూలలకీ చేర్చాయి. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు– హిట్. ఈ చైత్రవీణ ఝమ్‌ఝమ్మని– హిట్. ఇతను ఫాస్ట్‌గా ట్యూన్ ఇస్తాడు. అయితే ఏంటోయ్? ఫాస్ట్‌గా రాసే పాటగాడు మన దగ్గర ఉన్నాడుగా. వేటూరి. వీళ్ల కాంబినేషన్ ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’. కె.విశ్వనాథ్ మూడు ముఖ్యమైన హిట్స్‌కు ఇళయరాజా ఆలంబనగా నిలిచాడు.
‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘స్వర్ణకమలం’. కె.రాఘవేంద్రరావు హిట్ కోసం డెస్పరేట్‌గా ఉన్నప్పుడు హిట్స్ ఇచ్చాడు. ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వెంకటేశ్‌కు ‘బొబ్బిలిరాజా’తో స్టార్‌డమ్, ‘చంటి’తో క్లాస్ ఇమేజ్ సెటిల్ కావడానికి ఇతడి పాటలే కారణం. బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’లో చేసిన ‘జాణవులే నెరజాణవులే’ కలర్‌లో బ్లాక్ అండ్ వైట్ రోజులకు తీసుకెళ్లగలిగింది. ఇతను తెలుగు సినిమాల వల్ల మాత్రమే కాదు. గొప్ప గొప్ప తమిళ సినిమాల వల్ల కూడా తెలుగుకు వినిపిస్తూనే ఉన్నాడు.
మణిరత్నం, కె.బాలచందర్, ప్రియదర్శన్, ఫాజిల్, సింగీతం శ్రీనివాసరావు... వీళ్లు తమిళంలో చేసిన సినిమాలకు తెలుగు డబ్బింగ్ పాటలను కూడా ప్రేక్షకులు సోనీ 90 కేసెట్లలో దాచుకున్నారు. సంగీతానికి ఉన్మాద స్థాయిలో అభిమానులు ఏర్పడటం పాశ్చాత్య దేశాలలో చూశాం. హిందీలో ఈ ఉన్మాద స్థాయి నౌషాద్, శంకర్–జైకిషన్‌వంటి వారు చూశారు. దక్షిణాదిన అంతటి ఉన్మాద అభిమానుల బ్యాంక్‌ను మూటగట్టుకున్నది ఇతడే.
ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఇతని పాట తాకుతుంది. హృదయంతో తాకుతుంది. ఆత్మతో తాకుతుంది. పాట మధ్యలో ఒక వేణువు శకలం... పాట పల్లవిలో ఒక వయొలిన్ రన్... పాట అంచున ఒక తబలా ముక్తాయింపు... ఇవి ఏవో వారిని తాకి అలా స్థిరపడిపోతాయి. ఇతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడానికి సినిమాలకు వెళ్లినవాళ్లు ఉన్నారు.
ఇతని పాటలు వింటూ కారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే పిచ్చివాళ్లు నేటికీ ఉన్నారు. తెల్లటి లాల్చీ తెల్లటి పంచె కట్టుకున్న ఈ మనిషి తనలోని ఉన్నదంతా ఆ దేవుడినంతా ఆ తీపిని అంతా ఆ శోకం అంతా ఆ ఉల్లాసం అంతా కోస్తే వచ్చే ఆ దోరజామ సువాసన అంతా దాచుకోకుండా తల్లి తన సంతానానికి పంచినట్టు శ్రోతలను బిడ్డలనుకుని పంచిపెట్టాడు. ఆ హృదయం కోసమే వారు దాసోహమయ్యారు. కాలం మారవచ్చు. అక్కడ ఏ.ఆర్.రెహమాన్, ఇక్కడ కీరవాణి వంటి వారు అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేసి ఉండవచ్చు.
కొత్తకుర్రాళ్లు వచ్చి కొత్త హార్మోనియం మెట్లను పరుస్తుండవచ్చు. కాని– సముద్రం పాటు మీద ఉన్నప్పుడు పడవను ఎందరు దాటించ గలిగినా అది సముద్రం. ‘జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక’... లేస్తుంటుంది. ‘ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా’... లేస్తూనే ఉంటుంది. ప్రభూ... నీకు పద్మవిభూషణ్ అట. ప్రభాత సమయాన నీ చెలియలికట్టపై ఈ పువ్వును ఉంచినప్పుడు నువ్వు దరహాసంతో ఏ కొత్తపాటలోకో నిమగ్నమయ్యి అదే అసలు ప్రాప్తంగా ధన్యుడివవుతావు కదూ.
– ఖదీర్
Comments
Please login to add a commentAdd a comment