
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్‌కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.
ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్‌కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.

తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్‌కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్‌ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్‌లో సాంగ్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది.