దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
భారత ఆటోమొబైల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki)కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. చిన్న-కార్ల స్పెషలిస్ట్ సుజుకి మోటార్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా అభివృద్ధి చేసిన ఒసాము సుజుకికి మరణానంతరం ఈ అవార్డ్ ప్రకటించడం గమనార్హం. అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్యకు (Arundhati Bhattacharya) పద్మశ్రీ అవార్డ్ లభించింది.
ఒసాము సుజుకీ గత డిసెంబర్‌లో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్‌లో ఆటోమొబైల్ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్ రాజ్ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.
జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.
ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్ లింఫోమా (కేన్సర్‌లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్‌పై సానుకూల దృక్పథం, రిస్క్ తీసుకునే తత్వం, భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు.
నేడు భారత్‌లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది.
1958లో సుజుకీలో చేరిక..
1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్ లా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్; సీఈవోగా, 2000 జూన్‌లో సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్–జపాన్ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment