Suzuki Motor
-
వచ్చే నెల నుంచి సుజుకీ ఈవీ పరీక్షలు
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదలపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ తన ప్రణాళికలను ‘మూవ్’ సదస్సు సందర్భంగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రహదారి పరీక్షలు నిర్వహించనున్నట్టు సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకి తెలిపారు. భద్రత, ఇక్కడి వాతావరణం, రద్దీ పరిస్థితులకు అనుగుణంగా సులభంగా వినియోగించుకునేలా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం కోసమే ఈ పరీక్షలని వివరించారు. టయోటా మోటార్ కార్పొరేషన్ సహకారంతో 2020 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈవీల్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ గుజరాత్‌లోని ప్లాంట్‌లో 2020లో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. సరిపడా చార్జింగ్ సదుపాయాలు అభివృద్ధి చేయకుండా, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచలేమని గుర్తు చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి క్రీయాశీలక పాత్రను ఆశిస్తున్నట్టు ఒసాము సుజుకి చెప్పారు. 2030 నాటికి భారత్‌లో ఈవీలు 30 శాతం ఉంటాయని అంచనా వేశారు. ఈవీలతోపాటు, హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. సుజుకీతో కలసి పనిచేస్తున్నాం: టయోటా భారత్‌లో తమ కంపెనీ వాహనాలను ఎలక్ట్రిక్ ఆధారితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని టయోటా మోటార్ కార్పొరేషన్ సీఈవో తకేషి ఉచియామద తెలిపారు. ఇందుకు సంబంధించి సుజుకీతో కలసి పనిచేస్తున్నట్టు చెప్పారు. కొత్త భాగస్వామ్యాలకు సిద్ధం: టాటా తరచుగా మారుతున్న రవాణా విభాగంలో మెరుగైన పోటీనిచ్చేందుకు గాను కొత్త భాగస్వామ్యాలకు, వ్యాపార నమూనాలకు సిద్ధంగా ఉన్నట్టు టాటా మోటార్స్ ఎండీ గుంటెర్ బుస్చెక్ తెలిపారు. పట్టణ రవాణాకు ఈవీలు: ఎంఅండ్ఎం ‘‘భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలన్న ఆకాంక్షతో ఉంది. పట్టణ మాస్ రవాణాకు అనువైన వాహనాల అభివృద్ధికి ఇది మాకు అనుకూల సమయం. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో దేశీయంగా అగ్రగామిగా ఉన్న మహీంద్రా, ఈవీలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుంది’’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయంకా తెలిపారు. 500 మిలియన్ డాలర్లు: ఎంజీ మోటార్స్ 2020కి 500 మిలియన్ డాలర్లను భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఎంజీ మోటార్స్ ఇండియా ప్రకటించింది. భారత్‌లో నూతన ఇంధన ఆధారిత వాహనాలను ఎంజీ మోటార్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నట్టు ఎస్ఏఐసీ మోటార్ ప్రెసిడెంట్ చెన్ జిక్సిన్ తెలిపారు. ఫోర్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు ‘‘హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిపై చురుగ్గా పనిచేస్తున్నాం. ఈ వాహనాలను భారత మార్కెట్లోనూ ప్రవేశపెట్టనున్నాం’’ అని ఫోర్డ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బ్రెట్ వీట్లే తెలిపారు. మహీంద్రా ‘ట్రియో’... మహీంద్రా అండ్ మహీంద్రా లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ‘ట్రియో’, ‘ట్రియో యారి’లను మూవ్ సదస్సు సందర్భంగా ప్రదర్శించింది. ప్రధాని మోదీ వీటిని ఆవిష్కరించారు. పట్టణాల్లో రవాణాకు ఇవి అనుకూలంగా ఉంటాయని ఎంఅండ్ఎం సీఈవో మహేష్‌బాబు చెప్పారు. ట్రియో ప్రత్యేకతలు లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. దీర్ఘకాల మన్నిక.. నిర్వహణ ఖర్చు తక్కువ. క్రాష్గార్డ్, సొట్టపోని, తుప్పుపట్టని బాడీ. శబ్దాలు, కుదుపులు ఉండవు, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, నెమోటెక్ ద్వారా బ్యాటరీ స్టేటస్, లొకేషన్, మైలేజీ తెలుసుకునే ఫీచర్లు ఉన్నాయి. -
మారుతి కార్యాలయంపై దాడులు
టోక్యో: మైలేజ్ పరీక్ష కుంభకోణంలో మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామంటూ మారుతి తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామన్న సుజుకి వాదనల నిర్ధారణ కోసం ఈ దాడులు నిర్వహించినట్టు రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ ఇంధన మైలేజీ ఆరోపణలపై విచారణలో భాగంగా మినీ కార్ మేకర్ సుజుకి ఆఫీసుపై దాడి చేసినట్టు చెప్పారు. కాగా మైలేజీ గణంకాలు తప్పుగా పేర్కొన్నామని, తాము కూడా తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ పై రవాణా మంత్రిత్వశాఖ దాడి తర్వాత ఇది రెండవది. అక్రమ మైలేజీ గణంకాలతో 4 బ్రాండెడ్ మోడల్స్, 12 ఇతర బ్రాండ్లను సుజుకి విక్రయాలు జరిపింది -
రాష్ట్ర విపణిలోకి సుజుకీ ‘లెట్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహన రంగంలో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సుజుకీ మోటార్‌సైకిల్స్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా 18 నుంచి 22 ఏళ్ల లోపు వారి కోసం కొత్తగా ‘లెట్స్’ పేరుతో స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ స్కూటర్ హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ. 45,748గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేస్తున్న సందర్భంగా సుజుకీ మోటార్‌సైకిల్స్ వైస్ ప్రెసిడెంట్ కెంజీ హీరోజవా మాట్లాడుతూ భారతీయ అవసరాలకు అనుగుణంగా అత్యధిక మైలేజ్ ఇచ్చే విధంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 1.5 కోట్ల స్కూటర్లు అమ్ముడవుతుంటే అందులో సుజుకీ వాటా 3 శాతంగా ఉందని, దీన్ని ఈ ఏడాది 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం 600గా ఉన్న డీలర్ నెట్వర్క్ సంఖ్యను ఆర్థిక సంవత్సరాంతానికి 1,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది సుజుకీ 10,000 యూనిట్ల ద్విచక్రవాహనాలను ఎగుమతి చేసిందని, అది ఈ సంఖ్య 20,000 దాటుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై దృష్టి... దక్షిణాది రాష్ట్రాల్లో స్కూటర్లకు డిమాండ్ బాగుందని, దీంతో ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు సుజికి మోటార్‌సైకిల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డీలర్ల సంఖ్యను 60 నుంచి 100కు పెంచుతున్నామని, ప్రతీ నెలా 2,000 యూనిట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుజుకీ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో 70 శాతం స్కూటర్లు ఉంటే, 30 శాతం మోటార్ సైకిల్స్ ఉన్నాయని, దీన్ని రానున్న కాలంలో 50:50 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది. ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. వాటాదారుల వివరాలివీ... మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది.