భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదలపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ తన ప్రణాళికలను ‘మూవ్’ సదస్సు సందర్భంగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రహదారి పరీక్షలు నిర్వహించనున్నట్టు సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకి తెలిపారు. భద్రత, ఇక్కడి వాతావరణం, రద్దీ పరిస్థితులకు అనుగుణంగా సులభంగా వినియోగించుకునేలా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం కోసమే ఈ పరీక్షలని వివరించారు. టయోటా మోటార్ కార్పొరేషన్ సహకారంతో 2020 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈవీల్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ గుజరాత్‌లోని ప్లాంట్‌లో 2020లో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. సరిపడా చార్జింగ్ సదుపాయాలు అభివృద్ధి చేయకుండా, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచలేమని గుర్తు చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి క్రీయాశీలక పాత్రను ఆశిస్తున్నట్టు ఒసాము సుజుకి చెప్పారు. 2030 నాటికి భారత్‌లో ఈవీలు 30 శాతం ఉంటాయని అంచనా వేశారు. ఈవీలతోపాటు, హైబ్రిడ్, సీఎన్‌జీ వాహనాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు.
సుజుకీతో కలసి పనిచేస్తున్నాం: టయోటా
భారత్‌లో తమ కంపెనీ వాహనాలను ఎలక్ట్రిక్ ఆధారితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని టయోటా మోటార్ కార్పొరేషన్ సీఈవో తకేషి ఉచియామద తెలిపారు. ఇందుకు సంబంధించి సుజుకీతో కలసి పనిచేస్తున్నట్టు చెప్పారు.
కొత్త భాగస్వామ్యాలకు సిద్ధం: టాటా
తరచుగా మారుతున్న రవాణా విభాగంలో మెరుగైన పోటీనిచ్చేందుకు గాను కొత్త భాగస్వామ్యాలకు, వ్యాపార నమూనాలకు సిద్ధంగా ఉన్నట్టు టాటా మోటార్స్ ఎండీ గుంటెర్ బుస్చెక్ తెలిపారు.
పట్టణ రవాణాకు ఈవీలు: ఎంఅండ్‌ఎం
‘‘భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలన్న ఆకాంక్షతో ఉంది. పట్టణ మాస్ రవాణాకు అనువైన వాహనాల అభివృద్ధికి ఇది మాకు అనుకూల సమయం. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో దేశీయంగా అగ్రగామిగా ఉన్న మహీంద్రా, ఈవీలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుంది’’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయంకా తెలిపారు.
500 మిలియన్ డాలర్లు: ఎంజీ మోటార్స్
2020కి 500 మిలియన్ డాలర్లను భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఎంజీ మోటార్స్ ఇండియా ప్రకటించింది. భారత్‌లో నూతన ఇంధన ఆధారిత వాహనాలను ఎంజీ మోటార్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నట్టు ఎస్‌ఏఐసీ మోటార్ ప్రెసిడెంట్ చెన్ జిక్సిన్ తెలిపారు.
ఫోర్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు
‘‘హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిపై చురుగ్గా పనిచేస్తున్నాం. ఈ వాహనాలను భారత మార్కెట్లోనూ ప్రవేశపెట్టనున్నాం’’ అని ఫోర్డ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బ్రెట్ వీట్లే తెలిపారు.
మహీంద్రా ‘ట్రియో’...
మహీంద్రా అండ్ మహీంద్రా లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ‘ట్రియో’, ‘ట్రియో యారి’లను మూవ్ సదస్సు సందర్భంగా ప్రదర్శించింది. ప్రధాని మోదీ వీటిని ఆవిష్కరించారు. పట్టణాల్లో రవాణాకు ఇవి అనుకూలంగా ఉంటాయని ఎంఅండ్‌ఎం సీఈవో మహేష్‌బాబు చెప్పారు.
ట్రియో ప్రత్యేకతలు
లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. దీర్ఘకాల మన్నిక.. నిర్వహణ ఖర్చు తక్కువ.
క్రాష్‌గార్డ్, సొట్టపోని, తుప్పుపట్టని బాడీ.
శబ్దాలు, కుదుపులు ఉండవు, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, నెమోటెక్ ద్వారా బ్యాటరీ స్టేటస్, లొకేషన్, మైలేజీ తెలుసుకునే ఫీచర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment