రాష్ట్ర విపణిలోకి సుజుకీ ‘లెట్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహన రంగంలో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సుజుకీ మోటార్‌సైకిల్స్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా 18 నుంచి 22 ఏళ్ల లోపు వారి కోసం కొత్తగా ‘లెట్స్’ పేరుతో స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ స్కూటర్ హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ. 45,748గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేస్తున్న సందర్భంగా సుజుకీ మోటార్‌సైకిల్స్ వైస్ ప్రెసిడెంట్ కెంజీ హీరోజవా మాట్లాడుతూ భారతీయ అవసరాలకు అనుగుణంగా అత్యధిక మైలేజ్ ఇచ్చే విధంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 1.5 కోట్ల స్కూటర్లు అమ్ముడవుతుంటే అందులో సుజుకీ వాటా 3 శాతంగా ఉందని, దీన్ని ఈ ఏడాది 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం 600గా ఉన్న డీలర్ నెట్‌వర్క్ సంఖ్యను ఆర్థిక సంవత్సరాంతానికి 1,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది సుజుకీ 10,000 యూనిట్ల ద్విచక్రవాహనాలను ఎగుమతి చేసిందని, అది ఈ సంఖ్య 20,000 దాటుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్రంపై దృష్టి...
దక్షిణాది రాష్ట్రాల్లో స్కూటర్లకు డిమాండ్ బాగుందని, దీంతో ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు సుజికి మోటార్‌సైకిల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డీలర్ల సంఖ్యను 60 నుంచి 100కు పెంచుతున్నామని, ప్రతీ నెలా 2,000 యూనిట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుజుకీ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో 70 శాతం స్కూటర్లు ఉంటే, 30 శాతం మోటార్ సైకిల్స్ ఉన్నాయని, దీన్ని రానున్న కాలంలో 50:50 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.