Osamu Suzuki
-
తెలంగాణలో ప్లాంట్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా విషయంగా పరిగణిస్తున్నదని, ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా రెండోరోజు మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం గురువారం అక్కడి షిజువుక రాష్ట్రంలో సుజుకీ మోటార్స్ చైర్మన్ ఒసాము సుజుకీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీఎస్ ఐపాస్ పనితీరు, సింగిల్ విండో విధానంలో అనుమతుల తీరును మంత్రి సుజుకీ చైర్మన్‌కు వివరించారు. రాష్ట్రంలో సుజుకీ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితులైన సుజుకీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అనంతరం కేటీఆర్ బృందం షిజువుక రాష్ట్ర గవర్నర్ కవాకాస్తు హైటాతో సమావేశమై తెలంగాణ, షిజువుక రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. అనంతరం షిజువుక బ్యాంకు ప్రతినిధులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఈ రంగంలో సేవలందించేందుకు అవసరమైన మానవ వనరులు స్థానికంగా అందుబాటులో ఉన్నాయన్నారు. కేటీఆర్ బృందం సకురాయి లిమిటెడ్, స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ, ఏఎస్‌టీఐ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఆటో మొబైల్ రంగ విడిభాగాల ఉత్పత్తికి ముందుకు రావాలని ఏఎస్‌టీఐ కంపెనీని మంత్రి ఆహ్వానించారు. మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణీకులను సమీప ప్రాంతాలకు చేరవేసేందుకు సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆ సంస్థ తయారుచేస్తున్న గ్రాండ్ప్యాట్రియాక్ వాహనాలను నగరానికి సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆ కంపెనీని కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టుకు సంబం ధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సుజుకీ అధికారులు ఆసక్తిగా వీక్షించారు. -
సుజుకీ సీఈవో రాజీనామా!
తప్పుడు మైలేజీ టెస్టింగ్ బయటపడిన కారణంగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్ ఒసాము సుజుకీ, సీఈవో పదవికి రాజీనామా చేయబోతున్నారట. జపనీస్ ఆటోమొబైల్ సంస్థ సుజుకీ మోటార్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే సుజుకీ చైర్మన్ పదవిలో మాత్రం కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ నుంచి అనుమతి లభించాక జూన్ 29 నుంచి సుజుకీ చైర్మన్ పాత్రలో మార్పు, వైస్ ప్రెసిడెంట్ పదవీవిరమణ అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. మైలేజ్ టెస్టింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడం, ఇంజనీర్లకు మంచి శిక్షణ ఇవ్వడం వంటి మెరుగుదలలను చేపడతామని సుజుకీ చెప్పింది. జపాన్‌లోని కార్లకు ఇంధన సామర్ధ్యం, ఉద్గార పరీక్షలను నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకీ మే నెలల్లో అంగీకరించింది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించనందుకు సంజాయిషీ కూడా చెప్పింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టంచేసింది. 2010 నుంచి ఉన్న పరీక్షా పద్ధతులనే పాటిస్తూ వచ్చామని పేర్కొంది. 16 మోడళ్లు.. 20 లక్షల కార్లపైనే ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ మోసపూరిత చర్య వెల్లడవడంతో, గతవారం కంపెనీ ప్రధాన కార్యాలయంపై జపనీస్ ఇన్వెస్టిగేటర్స్ దాడులు కూడా చేశారు. -
మారుతీపై సెబీకి ఫండ్స్ ఫిర్యాదు
ముంబై: మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. కార్పొరేట్ గవర్నెన్స్, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను మారుతీ పాటించేలా చూడమంటూ కంపెనీలో వాటాలున్న మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు సెబీని సంప్రదించాయి. సంబంధిత వర్గాల సమాచారంమేరకు 16 మంది ప్రతినిధులతో కూడిన వాటాదారుల బృందం సెబీ చైర్మన్ యూకే సిన్హాకు మెమొరాండంను సమర్పించినట్లు తెలుస్తోంది. మారుతీలో ఈ సంస్థలకు 7% వాటా ఉంది. ఇక ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 6.93% వాటాను కలిగి ఉంది. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్‌ను సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను 100% వాటాగల సొంత అనుబంధ సంస్థ ద్వారా చేపట్టేందుకు సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో భవిష్యత్‌లో మారుతీ తయారీ సంస్థగా కాకుండా కేవలం మార్కెటింగ్‌కే పరిమితమయ్యే అవకాశమున్నదంటూ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. మారుతీ నిర్ణయంపై తమతో కలసి పోరాడాల్సిందిగా ఎల్ఐసీని సైతం ఫండ్స్, ప్రయివేట్ బీమా సంస్థలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ నెల 15న మారుతీ నిర్వహించనున్న బోర్డు సమావేశం లో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.