న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki) 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్‌లో ఆటోమొబైల్ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్ రాజ్ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.
జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.
ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్ లింఫోమా (కేన్సర్‌లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్‌పై సానుకూల దృక్పథం, రిస్క్ తీసుకునే తత్వం, భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు.
నేడు భారత్‌లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది.
1958లో సుజుకీలో చేరిక..
1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్ లా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్; సీఈవోగా, 2000 జూన్‌లో సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్–జపాన్ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమకు బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా, భారత్‌లో బలమైన సరఫరా వ్యవస్థ ఏర్పాటును ప్రోత్సహించింది’’అని ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) ప్రెసిడెండ్, సుబ్రోస్ కంపెనీ సీఎండీ శ్రద్ధా సూరి మార్వా అభిప్రాయపడ్డారు. ఒసాము వల్లే సామాన్యుడి చెంతకు కారు చేరిందని అన్నారు.
పరిశ్రమ నివాళి
ఒసాము సుజుకీ దార్శనిక నాయకత్వం వల్లే లక్షలాది మంది సామాన్యులకు కార్లు అందుబాటులోకి వచ్చినట్టు, భారత్ - జపాన్ మధ్య దృఢమైన బంధానికి బాటలు వేసినట్టు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వ్యాఖ్యానించారు. ఒసాము సుజుకీ మృతి పట్ల భారత ఆటోమొబైల్ పరిశ్రమ తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ‘‘స్థానికత, పెట్టుబడులు, ఆవిష్కణల పట్ల ఆయనకున్న నిబద్ధత శాశ్వత వారసత్వంగా నిలిచిపోతుంది’’అని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ప్యాసింజర్ కార్ల ప్రజాస్వామ్యానికి ఒసాము సుజుకీ కీలక పాత్ర పోషించారని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అన్నారు.
ఆటోమొబైల్ దిగ్గజం.. దార్శనికుడు
ఒసాము సుజుకీ మరణ వార్త నన్ను తీవ్రంగా బాధించింది. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ఆయనొక దిగ్గజం. ఆయన దార్శనికత మొబిలిటీ విషయంలో ప్రపంచ అవగాహననే మార్చివేసింది. ఆయన నాయకత్వంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ అంతర్జాతీయ దిగ్గజంగా అవతరించడమే కాదు, సవాళ్లను విజయవంతంగా అధిగమించడంతోపాటు, ఆవిష్కరణలు, విస్తరణ దిశగా అడుగులు వేసింది. సుజుకీతో నాకున్న సంప్రదింపుల మధుర జ్ఞాపకాలను ఎంతో ఇష్టపడతాను. ఆయన ఆచరణాత్మక, వినయపూర్వక విధానాన్ని మెచ్చుకుంటున్నాను. ఆయన కుటుంబానికి, సహచరులకు, ఆయన్ను విశ్వసించే ఎంతో మందికి ఈ సందర్భంగా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment