దిగ్గజ పారిశ్రామిక వేత్త 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) తన 94ఏళ్ల వయసులో ఈ రోజు (డిసెంబర్ 25) తుదిశ్వాస విడిచారు. జపనీస్ వ్యాపారవేత్త.. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అయిన ఈయన 2021లో పదవీ విరమణ చేశారు. ఇంతకీ ఈయన ప్రస్థానం ఎలా మొదలైంది? సుజుకి కంపెనీలోకి ఎలా వచ్చారు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లితో మలుపు తిరిగిన జీవితం
1930 జనవరి 30న మత్సుడా.. షుంజో దంపతులకు జన్మించిన ఒసాము.. 1953లో చువో యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆ తరువాత బ్యాంకులో పనిచేశారు. అయితే 'మిచియో సుజుకి' (Michio Suzuki) మనవరాలు 'షోకో సుజుకి' (Shoko Suzuki)ని వివాహం చేసుకోవడంతో ఈయన జీవితం మలుపు తిరిగింది.
సుజుకి కుటుంబంలో వారసులు లేకపోవడం వల్ల మిచియో సుజుకి.. ఒసాము కుటుంబంలో తన మనవారికి వివాహం చేశారు. జపనీస్ ఆచారాన్ని అనుసరించి ఒసాము.. సుజుకి ఇంటిపేరును స్వీకరించారు. దీంతో ఒసాము మత్సుడా.. ఒసాము సుజుకి అయ్యారు.
జూనియర్ మేనేజ్‌మెంట్ నుంచి డైరెక్టర్ స్థాయికి
ఒసాము సుజుకి 1958లో సుజుకి మోటార్ కార్పోరేషన్‌లో చేరారు. కంపెనీలో జూనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులతో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తూ.. 1963లో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 2000లో సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు.
సుజుకి మోటార్ కార్పోరేషన్ అధిపతిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన.. ఒసాము సుజుకి ప్రపంచ ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతి తక్కువ కాలంలోనే సుజుకి కార్పొరేషన్‌ను ప్రపంచంలోని అతి పెద్ద చిన్న కార్ల తయారీదారులలో ఒకటిగా మార్చారు. చిన్న కార్ల మార్కెట్‌ను విస్తరించడం ద్వారా సుజుకి కంపెనీ గణనీయమైన పురోగతిని సాధించింది. సుజుకి కంపెనీని భారతదేశంలోని తీసుకొచ్చిన ఘనత కూడా ఒసాము సొంతం.
యూరోపియన్ మార్కెట్‌లోకి ప్రవేశం
సుజుకి మోటార్ కార్పోరేషన్ ఉనికిని విస్తరిస్తూ.. విదేశాలలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ప్రారభించారు. ఇలా ఏర్పడిన ప్లాంట్‌లలో మొదటిది థాయిలాండ్‌లో ఉంది. ఆ తరువాత ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లలో కూడా కంపెనీ ప్లాంట్స్ ఏర్పాటు అయ్యాయి. అదే సమయంలో జనరల్ మోటార్స్‌తో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన.. సుజుకి కార్పొరేషన్‌ను యూరోపియన్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. జపాన్‌కు మాత్రమే పరిమితమైన సంస్థను ఒసాము నలుదిశలా వ్యాపింపజేశారు.
31 దేశాలలో 60 ప్లాంట్‌లు
ఒసాము సుజుకి సారథ్యంలో ఎదిగిన కంపెనీ 21వ శతాబ్దం ప్రారంభం నాటికి 31 దేశాలలో 60 ప్లాంట్‌లను కలిగి ఉంది. సుమారు 190 దేశాలలో విక్రయాలను సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చిన్న కార్ల విభాగంలో మాత్రమే కాకుండా.. టూ వీలర్ విభాగంలో కూడా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది.
ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
పారిశ్రామిక రంగంలో ఒసాము సుజుకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్'తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం.. సితార ఏ పాకిస్తాన్ అవార్డును ప్రధానం చేసింది. ఓ బ్యాంకు ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచమే గుర్తించేలా ఎదిగిన 'ఒసాము'.. పారిశ్రామిక రంగంలో ఓ ధ్రువతార అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment