
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.
లింగ సమానత్వం అంటే..
తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.

అవధులు లేని ప్రపంచాన్ని
దశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
క్యాలెండర్‌లో ఒక తేదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.

ప్రతిభకు హద్దులు లేవు
గౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment