మారుతీపై సెబీకి ఫండ్స్ ఫిర్యాదు
ముంబై: మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. కార్పొరేట్ గవర్నెన్స్, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను మారుతీ పాటించేలా చూడమంటూ కంపెనీలో వాటాలున్న మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు సెబీని సంప్రదించాయి. సంబంధిత వర్గాల సమాచారంమేరకు 16 మంది ప్రతినిధులతో కూడిన వాటాదారుల బృందం సెబీ చైర్మన్ యూకే సిన్హాకు మెమొరాండంను సమర్పించినట్లు తెలుస్తోంది. మారుతీలో ఈ సంస్థలకు 7% వాటా ఉంది. ఇక ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 6.93% వాటాను కలిగి ఉంది. గుజరాత్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్‌ను సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్‌ను 100% వాటాగల సొంత అనుబంధ సంస్థ ద్వారా చేపట్టేందుకు సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో భవిష్యత్‌లో మారుతీ తయారీ సంస్థగా కాకుండా కేవలం మార్కెటింగ్‌కే పరిమితమయ్యే అవకాశమున్నదంటూ సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. మారుతీ నిర్ణయంపై తమతో కలసి పోరాడాల్సిందిగా ఎల్‌ఐసీని సైతం ఫండ్స్, ప్రయివేట్ బీమా సంస్థలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ నెల 15న మారుతీ నిర్వహించనున్న బోర్డు సమావేశం లో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.