వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు.
నాలుగేళ్లలో మూడు రెట్లు..
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.
ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్‌ఎం రీట్
అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతి
ప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్‌గా నిలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment