దేశీయంగా తొలిసారి రిజిస్టర్డ్ స్మాల్ మీడియం (ఎస్‌ఎం) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్) పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. తద్వారా రూ.353 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ వెల్లడించింది. సంస్థ నుంచి వెలువడుతున్న తొలి ఎస్‌ఎం రీట్ పథకం ప్రాప్‌షేర్ ప్లాటినాకు రూ.10–10.5 లక్షల ధరల శ్రేణిని ప్రకటించింది.
ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఎలాంటి యూనిట్లను ఆఫర్ చేయకపోగా.. పూర్తిగా ప్లాటినా యూనిట్లను జారీ చేయనున్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(పీఎస్‌ఐటీ) పేర్కొంది. ఇష్యూ నిధులను ప్లాటినా ఎస్‌పీవీకిగల ప్రెస్టీజ్ టెక్ ప్లాటినా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రాప్‌షేర్ ప్లాటినా తరహా ఎస్‌ఎం రీట్స్‌వల్ల ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలగనున్నట్లు ప్రాపర్టీ షేర్ డైరెక్టర్ కునాల్ మోక్టన్ తెలియజేశారు. నిరవధిక అద్దె రిటర్నులు(ఈల్డ్స్), పెట్టుబడుల వృద్ధి ద్వారా హైబ్రిడ్ రాబడులకు వీలున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
ప్రాప్‌షేర్ ప్లాటినా 2,46,935 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్‌వద్ద ప్రెస్టీజ్ టెక్ ప్లాటినాకు చెందిన లీడ్ గోల్డ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ ఆస్థిని కలిగి ఉంది. యూఎస్ టెక్ కంపెనీకి పూర్తిస్థాయిలో 9 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇందుకు 4.6 ఏళ్ల సగటు వెయిటేజీ లాకిన్‌తోపాటు ప్రతీ మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు ప్రాతిపదికను ఎంపిక చేసుకుంది. వెరసి తాజా పథకం 2026లో ఇన్వెస్టర్లకు 9 శాతం పంపిణీ ఈల్డ్‌ను అంచనా వేస్తోంది. 2027లో 8.7 శాతం, 2028లో 8.6 శాతం చొప్పున రిటర్నులకు వీలుంది. యూనిట్లను బీఎస్‌ఈలో లిస్ట్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment