పుష్కర స్టేషన్లపై ప్రత్యేక దృష్టి
రాజమండ్రి స్టేషన్‌లో సీనియర్ రైల్వే అధికారులు మకాం
తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక చర్యలు
విజయవాడ స్టేషన్‌లోనూ ఏర్పాట్లు
విజయవాడ : పుష్కరాలు తొలిరోజున రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విజయవాడ డివిజన్ పరిధిలోని రాజమండ్రి, గోదావరి, నర్సాపురం స్టేషన్ల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో ఆయా స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు రైల్వే డీఆర్‌ఎం అశోక్‌కుమార్ తెలిపారు.
ప్రతి గంటకు 40 వేల మంది.....
విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లలో రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాజమండ్రి వెళ్లుతున్నారని అంచనా. ఇదిలా ఉండగా రాజమండ్రి స్టేషన్‌లో ప్రతి గంటకు 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రిలోని నాలుగు ఫ్లాట్‌పారాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ మరింత పెరిగితే తొక్కిసలాట జరుగుతుందని భావిస్తున్న అధికారులు పుష్కర స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రద్దీ ఎక్కువగా వుండటంతో గుడివాడ నుంచి నడిచే పాసింజర్ రైలును రద్దు చేసి రాజమండ్రికి తరలించారు.
తరలి వెళ్లిన సీనియర్ అధికారులు....
విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉండి డివిజన్‌లోని అన్ని ఏర్పాట్లును పరిశీలించే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) అశోక్‌కుమార్, ఏడీఆర్‌ఎం ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్, సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎన్.వి. సత్యనారాయణ, సీనియర్ పీఆర్‌వో ఎఫ్.ఆర్. మైఖేల్ తదితర కీలక అధికారులు మూడు రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసి, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు పుష్కర స్టేషన్ల నుంచి వారి వారి గమ్యస్థానాలకు పంపేందుకు ప్రయత్నిస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆయా స్టేషన్లలో సిబ్బంది తక్కువగా వుండటంతో 1,500 మందిని ప్రత్యేకంగా డివిజన్‌లోని అన్ని ప్రాంతాల నుంచి తరలించారు. అంతేకాకుండా చోరీలు జరగకుండా ఉండేం దుకు, రద్దీ సమయాల్లో అవాంఛనీయ ఘటన లు జరగకుండా డివిజన్‌లోని అన్ని స్టేషన్ల నుంచి 1,600 మంది జీఆర్‌పీ, 400 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బందిని పుష్కర స్టేషన్లకు తరలించా రు. పుష్కరయాత్ర పూర్తి చేసుకుని వచ్చే ప్రయాణికులు గమస్థానాలకు వెళ్లేం దుకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విచారణా కేంద్రాలను, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
విజయవాడ స్టేషన్‌పై పెరుగుతున్న రద్దీ...
విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా శని(రంజాన్), ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా వుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచి రాజమండ్రి, నర్సాపురం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్ల సమాచారాన్ని ప్రత్యేక బోర్డుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. అలా గే తూర్పు, పశ్చిమ ముఖద్వారం వద్ద ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్పెషల్ రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటి కప్పుడు మైక్‌ల ద్వారా ప్రసారాలు చేస్తూ ప్రయాణికులకు తెలియచేస్తున్నారు.