బెల్టు మాటేంటి?! | Elimination of gudumba | Sakshi
Sakshi News home page

బెల్టు మాటేంటి?!

Published Fri, Dec 30 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

బెల్టు మాటేంటి?!

బెల్టు మాటేంటి?!

గుడుంబా నిర్మూలనకు రంగంలోకి దిగిన అధికారులు
అది జరిగినా బెల్టు దుకాణాలు ఉంటే ఫలితం సున్నా..
జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు
వెయ్యికి పైగానే ఉన్నట్లు అంచనా


హన్మకొండ : గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే మద్యం బెల్టు దుకాణాలు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జిల్లాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన అధికారులు బెల్టు షాపుల మాటెత్తకపోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దినా బెల్టు షాపులు కొనసాగితే అధికారుల కృషికి ఫలితం ఉండకపోవచ్చు.

అధికారికంగా 57 వైన్స్‌.. మూడు బార్లు
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 15మండలాల్లో 57 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. అయితే, వీటికి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు మద్యం అమ్మే బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ప్రధాన దుకాణాలకు సమానంగా ‘బెల్టు’ వ్యాపారం కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని గ్రామాల్లోనైతే బెల్టు దుకాణం నడపడం కొందరికి ఉపాధిగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం మత్తు కారణంగా, గుడుంబా ప్రభావంతో వందలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. వివిధ గ్రామాల్లో మత్తుకు చిత్తై అనేక మంది మృతి చెందగా 80శాతం మంది వితంతువులే కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

గుడుంబా నిర్మూలనకు కమిటీలు
మత్తు అనేక కుటుంబాలను చిత్తు చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో గుడుంబా, నల్లబెల్లాన్ని సమూలంగా నిర్మూలించి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24న జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్‌ పోలీసు కమిషనర్‌తో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న గుగుంబా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా తయారీ, రవాణా, అమ్మకందారులపై నిఘా పెట్టాలని ఈ సమావేశంలో కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే, నల్లబెల్లం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, మహిళాసంఘాలు, సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లతో గ్రామాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. గుడుంబా, నల్లబెల్లం దొరికితే పీడీ చట్టం కింద కేసులు పెట్టడంతో పాటు, రూ.లక్ష వరకు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా గుడుంబాపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ప్రత్యేక వాట్సాప్‌ నంబరును నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సమావేశంలో తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా... మద్యం షాపులకు సమాంతంగా నడుస్తున్న బెల్టు షాపుల నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మద్యం దుకాణాల తరలింపు
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు, బార్లను వచ్చే మార్చి 30లోగా 500మీటర్ల లోపలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించారు. దీంతో రహదారుల వెంట ఉన్న షాపుల యజమానులకు ఆబ్కారీ అధికారులు తాజాగా జిల్లాలోని 21దుకాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రహదారుల పక్కన ఉన్న ఈ దుకాణాలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఆబ్కారీ సూపరింటెండెంట్‌ తెలిపారు. అలాగే, ఎనిమిది కల్లు దుకాణాలను సైతం హైవేల పక్క నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా గుడుంబా రహిత జిల్లాగా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం బెల్టు షాపుల నిర్మూలన విషయమై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, దీనికి కూడా న్యాయస్థానాలే ఆదేశాలు జారీ చేయాలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement