Strap liquor stores
-
బెల్టు మాటేంటి?!
గుడుంబా నిర్మూలనకు రంగంలోకి దిగిన అధికారులు అది జరిగినా బెల్టు దుకాణాలు ఉంటే ఫలితం సున్నా.. జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు వెయ్యికి పైగానే ఉన్నట్లు అంచనా హన్మకొండ : గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే మద్యం బెల్టు దుకాణాలు వరంగల్ రూరల్ జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జిల్లాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన అధికారులు బెల్టు షాపుల మాటెత్తకపోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దినా బెల్టు షాపులు కొనసాగితే అధికారుల కృషికి ఫలితం ఉండకపోవచ్చు. అధికారికంగా 57 వైన్స్.. మూడు బార్లు వరంగల్ రూరల్ జిల్లాలోని 15మండలాల్లో 57 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. అయితే, వీటికి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు మద్యం అమ్మే బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ప్రధాన దుకాణాలకు సమానంగా ‘బెల్టు’ వ్యాపారం కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని గ్రామాల్లోనైతే బెల్టు దుకాణం నడపడం కొందరికి ఉపాధిగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం మత్తు కారణంగా, గుడుంబా ప్రభావంతో వందలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. వివిధ గ్రామాల్లో మత్తుకు చిత్తై అనేక మంది మృతి చెందగా 80శాతం మంది వితంతువులే కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుడుంబా నిర్మూలనకు కమిటీలు మత్తు అనేక కుటుంబాలను చిత్తు చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో గుడుంబా, నల్లబెల్లాన్ని సమూలంగా నిర్మూలించి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24న జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్‌తో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న గుగుంబా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా తయారీ, రవాణా, అమ్మకందారులపై నిఘా పెట్టాలని ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. అలాగే, నల్లబెల్లం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, మహిళాసంఘాలు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లతో గ్రామాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. గుడుంబా, నల్లబెల్లం దొరికితే పీడీ చట్టం కింద కేసులు పెట్టడంతో పాటు, రూ.లక్ష వరకు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా గుడుంబాపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ప్రత్యేక వాట్సాప్ నంబరును నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశంలో తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా... మద్యం షాపులకు సమాంతంగా నడుస్తున్న బెల్టు షాపుల నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యం దుకాణాల తరలింపు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు, బార్లను వచ్చే మార్చి 30లోగా 500మీటర్ల లోపలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించారు. దీంతో రహదారుల వెంట ఉన్న షాపుల యజమానులకు ఆబ్కారీ అధికారులు తాజాగా జిల్లాలోని 21దుకాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రహదారుల పక్కన ఉన్న ఈ దుకాణాలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్ ఆబ్కారీ సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే, ఎనిమిది కల్లు దుకాణాలను సైతం హైవేల పక్క నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా గుడుంబా రహిత జిల్లాగా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం బెల్టు షాపుల నిర్మూలన విషయమై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, దీనికి కూడా న్యాయస్థానాలే ఆదేశాలు జారీ చేయాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
ఉసురు తీస్తున్న ‘బెల్ట్’
రాజధాని ప్రాంతంలో తాగునీరు లేని పల్లెలు అనేకం ఉన్నాయి. మద్యం బెల్టు దుకాణాలు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ .. ఎంత కావాలంటే అంత..దొరుకుతోంది. కావల్సిందల్లా చేతిలో పైసలు, సెల్ఫోన్లో బ్యాలెన్స్.... అంతే నంబర్ నొక్కితే చాలు క్షణాల్లో కళ్ల ముందు మద్యం బాటిల్ కనిపిస్తోంది. మద్యంలో కల్తీ కలిసినా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నేటికీ నెరవేరకపోవడంతో కష్టజీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమరావతి మండలం మునగోడులో గురువారం ఉదయం బెల్టుదుకాణంలో మద్యం తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. పెదకూరపాడు : అమరావతి మండలం మునగోడు గ్రామానికి చెందిన మేకల కాటమరాజు(60) ఇంటి వద్దే బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళుతూ ఒక క్వార్టర్ బాటిల్ వెంట తీసుకెళ్లాడు. సమీపంలోని షాపు వద్ద ఆగి డిస్పోజల్ గ్లాసు, కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. సగం గ్లాసులో పోసుకుని మిగిలిన బాటిల్ అక్కడే ఉన్న దూరపు బంధువు గండు నీలయ్య(40)కు ఇచ్చాడు. మద్యంలో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగిన ఐదు నిముషాల వ్యవధిలో కాటమరాజు కుప్పకూలి అక్కడిక్కడే మరణించాడు. ఈలోపే బాటిల్‌తో ఇంటికి వెళ్లిన నీలయ్య మిగిలిన మద్యంలో నీరు కలుపుకొని కొంత తాగాడు. కొద్ది సేపటికే కుప్పకూలిపోయిన నీలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మునగోడు ఘటనతో భయం భయం.. మునగోడు ఘటనతో బెల్టు షాపుల నిర్వాహకులు, మద్యం తాగే వారిలో ఆందోళన మొదలైంది. పదిహేను రోజుల కిందట పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న బెల్టు షాపులో మద్యం తాగి బంకా మరియస్వామి అనే వ్యక్తి చెరువులో దూకి మృతి చెందాడు. ఈ విధంగా గ్రామాల్లో బెల్టుషాపులు ప్రాణాలు తీస్తున్నాయి. నియోజకవర్గంలో 24 అనుమతి పొందిన మద్యం షాపులు ఉండగా, అక్రమంగా విక్రరుుస్తున్న షాపులు 220కి పైగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కష్టజీవులే లక్ష్యంగా.. కష్టజీవులను టార్గెట్ చేసుకొని పల్లెల్లో బెల్టు షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లో వేళాపాళా పాలనా లేకుండా, అర్ధరాత్రి, తెల్లవారుజూము సైతం మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో లెసైన్సు షాపులను సైతం తెరిచి, బెల్టుషాపులకు మద్యం అమ్ముకుంటున్నారు. దీంతో మద్యం వ్యసనానికి బానిసలైనవారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అధికారం ఇస్తే బెల్టు ఎత్తెస్తామన్నారే.... రాజధాని ప్రాంతంలో తాగునీరు లేని పల్లెలు అనేకం ఉన్నాయి. బెల్టు షాపు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పుకొచ్చారు. నేడు పల్లెల్లో బెల్టు షాపుల్లో మద్యం ఏరులైపారుతోంది. వేల సంఖ్యలో బెల్టు దుకాణాలు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి మొత్తం 750 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో లెసైన్స్ మద్యం దుకాణం పరిధిలో 10 నుంచి 15 వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 6 వేల వరకు బెల్టు షాపులు ఉన్నట్టు అంచనా. అధికారుల అండతోనే బెల్టుషాపులు కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. యథేచ్ఛగా అమ్మకాలు..... నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో రెండు లెసైన్సుషాపులు ఉన్నాయి. ఒకటి మాత్రమే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండోషాపు తీరు చూస్తే మూసివేశారని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ నుంచి కేవలం బెల్టు షాపులకు మాత్రమే అమ్మకాలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఒకరు స్థానిక అధికార పార్టీ నేతకు బంధువు కావడంతో యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.