రాజధాని ప్రాంతంలో తాగునీరు లేని పల్లెలు అనేకం ఉన్నాయి. మద్యం బెల్టు దుకాణాలు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ .. ఎంత కావాలంటే అంత..దొరుకుతోంది. కావల్సిందల్లా చేతిలో పైసలు, సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్.... అంతే నంబర్ నొక్కితే చాలు క్షణాల్లో కళ్ల ముందు మద్యం బాటిల్ కనిపిస్తోంది. మద్యంలో కల్తీ కలిసినా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నేటికీ నెరవేరకపోవడంతో కష్టజీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమరావతి మండలం మునగోడులో గురువారం ఉదయం బెల్టుదుకాణంలో మద్యం తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు.
పెదకూరపాడు : అమరావతి మండలం మునగోడు గ్రామానికి చెందిన మేకల కాటమరాజు(60) ఇంటి వద్దే బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళుతూ ఒక క్వార్టర్ బాటిల్ వెంట తీసుకెళ్లాడు. సమీపంలోని షాపు వద్ద ఆగి డిస్పోజల్ గ్లాసు, కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. సగం గ్లాసులో పోసుకుని మిగిలిన బాటిల్ అక్కడే ఉన్న దూరపు బంధువు గండు నీలయ్య(40)కు ఇచ్చాడు. మద్యంలో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగిన ఐదు నిముషాల వ్యవధిలో కాటమరాజు కుప్పకూలి అక్కడిక్కడే మరణించాడు. ఈలోపే బాటిల్‌తో ఇంటికి వెళ్లిన నీలయ్య మిగిలిన మద్యంలో నీరు కలుపుకొని కొంత తాగాడు. కొద్ది సేపటికే కుప్పకూలిపోయిన నీలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
మునగోడు ఘటనతో భయం భయం..
మునగోడు ఘటనతో బెల్టు షాపుల నిర్వాహకులు, మద్యం తాగే వారిలో ఆందోళన మొదలైంది. పదిహేను రోజుల కిందట పెదకూరపాడు మండలం జలాల్‌పురం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న బెల్టు షాపులో మద్యం తాగి బంకా మరియస్వామి అనే వ్యక్తి చెరువులో దూకి మృతి చెందాడు. ఈ విధంగా గ్రామాల్లో బెల్టుషాపులు ప్రాణాలు తీస్తున్నాయి. నియోజకవర్గంలో 24 అనుమతి పొందిన మద్యం షాపులు ఉండగా, అక్రమంగా విక్రరుుస్తున్న షాపులు 220కి పైగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కష్టజీవులే లక్ష్యంగా..
కష్టజీవులను టార్గెట్ చేసుకొని పల్లెల్లో బెల్టు షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లో వేళాపాళా పాలనా లేకుండా, అర్ధరాత్రి, తెల్లవారుజూము సైతం మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో లెసైన్సు షాపులను సైతం తెరిచి, బెల్టుషాపులకు మద్యం అమ్ముకుంటున్నారు. దీంతో మద్యం వ్యసనానికి బానిసలైనవారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అధికారం ఇస్తే బెల్టు ఎత్తెస్తామన్నారే....
రాజధాని ప్రాంతంలో తాగునీరు లేని పల్లెలు అనేకం ఉన్నాయి. బెల్టు షాపు లేని గ్రామాలు మాత్రం లే వంటే అతిశయోక్తి కాదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పుకొచ్చారు. నేడు పల్లెల్లో బెల్టు షాపుల్లో మద్యం ఏరులైపారుతోంది.
వేల సంఖ్యలో బెల్టు దుకాణాలు...
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి మొత్తం 750 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో లెసైన్స్ మద్యం దుకాణం పరిధిలో 10 నుంచి 15 వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 6 వేల వరకు బెల్టు షాపులు ఉన్నట్టు అంచనా. అధికారుల అండతోనే బెల్టుషాపులు కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యం.
యథేచ్ఛగా అమ్మకాలు.....
నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో రెండు లెసైన్సుషాపులు ఉన్నాయి. ఒకటి మాత్రమే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండోషాపు తీరు చూస్తే మూసివేశారని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ నుంచి కేవలం బెల్టు షాపులకు మాత్రమే అమ్మకాలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఒకరు స్థానిక అధికార పార్టీ నేతకు బంధువు కావడంతో యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.