కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వివక్ష చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మసాగునీటి పథకం కింద వివిధ వర్గాల రైతులకు ప్రకటించిన సబ్సిడీల విషయంలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఉన్న రైతులకు ఒక విధంగా, వైఎస్సార్ జిల్లాతోపాటు మిగతా 11 జిల్లాల రైతులకు మరో విధంగా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు-34ని విడుదల చేసింది.
ఆ జీవో ఏం చెబుతోందంటే..
సూక్ష్మ సాగు నీటి సేద్య పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను మార్పులు చేసి ప్రభుత్వం జీవో నెంబర్ 34ను విడుదల చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతుల్లో 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 100 శాతం సబ్సిడీ, ఇతర వర్గాల్లో 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు 90 శాతం, 5 ఎకరాలకంటే మించి ఉంటే పెద్ద కారు రైతులుగా గుర్తించి 70 శాతం సబ్సిడీని అమలు చేస్తామని ప్రకటించింది. అలాగే గతంలో రెండున్నర హెక్టారుకుపైగా ఉన్న రైతులకు రూ. లక్ష వరకు పథక యూనిట్‌ను వినియోగించుకునే వీలుండేది, అయితే ఇప్పుడు ఆ సీలింగ్‌ను రూ. 2 లక్షల వరకు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు.
కానీ ఇక్కడే మరో మెలికపెట్టింది. జీవో ఎంఎస్ నంబరు-34 ప్రకారం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 10 ఎకరాలకు పథకాన్ని వినియోగించుకునే రైతులు చిన్నతరహా రైతులట, అదే పొరుగు జిల్లాలో 5 ఎకరాలలోపు భూమి ఉండి పథకాన్ని వినియోగించుకునే రైతులు పెద్దకారు రైతులా? అని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
కరువు ప్రాంతానికి చేసేది ఇదేనా...:
అనంతపురం జిల్లా రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే..మరి చిత్తూరు జిల్లాలో వర్షపాతం ఎక్కువగానే ఉంది. ఆ జిల్లాకు సూక్ష్మ సేద్యంలో మినహాంపులు దేనికిచ్చారో సీఎం రైతులకు వివరించాలి. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు దీనిపై ప్రశ్నించకపోవడం దారుణం.
-టి. రామసుబ్బారెడ్డి, జిల్లా ఏపీ రైతు సంఘం(సీపీఐ)
వివక్ష లేదంటూనే సీఎం నైజాన్ని
నిరూపించుకున్నారు..
వైఎస్సార్ జిల్లాపై ఎలాంటి వివక్షలేదు. జిల్లాలో నీటి వనరులపై దృష్టిపెట్టాం.రైతులను ఆదుకుంటామన్న పెద్ద మనిషి ఇప్పుడు వివక్ష చూపి తన నైజాన్ని నిరూపించుకున్నారు.
-ఎస్. ప్రసాదరెడ్డి,
కన్వీనరు,వైఎస్సార్ సీపీ జిల్లా రైతు సంఘం.
ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు
ఎన్నో ప్రభుత్వాలను చూశాం, రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యహరించిన దాఖలాలు గతంలోలేవు. 5-10 ఎకరాలు ఉన్న రైతులు సాధారణంగా ఎక్కడైనా చిన్నకారు రైతులే. కానీ రెండు జిల్లాలకు ఒక విధంగా. మరో జిల్లాకు ఇంకో విధంగా వర్తింపజేయడ ం అన్యాయం.
- లింగమూర్తి,
ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి(సీపీఎం)
ఇది ప్రభుత్వ పాలసీ...
అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఏరియా విస్తీర్ణంలో, ఇతర జిల్లాలతో ఉన్న తేడాల గురించి రైతులు అడుగుతున్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.
- ఎ రమేష్‌రెడ్డి.
పీడీ, జిల్లా సూక్ష్మసాగునీటి సేద్య పథకం.