సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్‌సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.
నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..
సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.
అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.
ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment