ఎలాంటి వేధింపులైనా ధైర్యంగా ఫిర్యాదు చేయండి
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
‘మీతో సాక్షి’తో మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయల్
మహిళా పాఠకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు అతివలకు అన్ని వేళలా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ భరోసా ఇచ్చారు. సమస్య ఏదైనా డయల్ 100కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వస్తారని హామీ ఇచ్చారు. రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు నేటికీ ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా శిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘మీతో సాక్షి’ శీర్షికన ఆగస్టు 27 నుంచి 3 రోజులపాటు సాక్షి నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మహిళలు పలు సమస్యలను ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వాటికి శిఖాగోయల్ సమాధానాలిచ్చారు.
పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలు, వాటికి శిఖాగోయల్ ఇచ్చిన సమాధానాలు..
ప్రశ్న: కోల్‌కతాలో ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్ల భద్రతతోపాటు మహిళా రోగులు, వారి సహాయకుల భద్రతకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? – (అనురాధరావు, బాలలహక్కుల సంఘం)
జవాబు: ఆస్పత్రుల్లో భద్రతాపరమైన మౌలికవసతుల కల్ప నపై దృష్టి పెట్టాం. అన్ని ఆస్పత్రుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయి ంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా తెలుసుకొనేందుకు స్థానిక పోలీసుల ద్వారా సెక్యూరిటీ ఆడిట్‌లు నిర్వహిస్తున్నాం. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి మాకు సమాచారం అందింది. ఆ నిబంధనలు రాగానే ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటాం.
ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే లా యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటున్నాం. విమెన్ సేఫ్టీ వింగ్‌లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే సాహస్ మాడ్యూల్ ద్వారా పోష్ యాక్ట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెస్సల్)పై ప్రచారం కలి్పస్తున్నాం. ఆస్పత్రుల్లో లైంగిక వేధింపులను కట్టడిచేసేందుకు ‘సాహస్’ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలో గతంలో ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్ ఇచ్చి అది ఆ వాహనం వెనుక డిస్‌ప్లే అయ్యేలా చేశారు. ఈమధ్య అది కనిపించట్లేదు. ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్ల వివరాలు పోలీసుల దృష్టిలో ఉండేలా మహిళా భద్రత విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? – (హిమజ, ఓ కార్పొరేట్ కంపెనీ ఎండీ హైదరాబాద్)
జవాబు: రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగర యూనిట్లలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ ప్రచారం ఉంది. ఆటో డ్రైవర్ల వివరాలు పోలీసులు తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. ఆటోలలో పోలీసుల ఫోన్ నంబర్లు ఉండేలా చూస్తున్నాం. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం అంతటా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. మీరు మీ ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండేలా డయల్ 100కు కాల్ చేసి అందులో 8 నొక్కడం ద్వారా ‘టీ–సేఫ్’ను ఎంచుకుంటే మీ ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీసు పర్యవేక్షణ ఉంటుంది. https://womensafetywing. telang ana. gov. in/ women& safety& apps/ tsafe/ వెబ్‌సైట్‌లో లేదా టీ–సేఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని అందులో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసినా కూడా పోలీసులు మీ ప్రయాణం సురక్షితంగా పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తారు. ఏ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగుతారు. టీ–సేఫ్ యాప్‌లో ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు.
ప్రశ్న: ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల హక్కులు, వారి భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా మా కార్యాలయంలో అలాంటి సమావేశాలు నిర్వహించట్లేదు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు, టీజింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు మహిళలు వెనకాడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి?
– (నీలిమ, ఓ ఐటీ సంస్థ ప్రాజెక్టు మేనేజర్, గచ్చి»ౌలి)
జవాబు: పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు తెచి్చన పోష్ యాక్ట్–2013 ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నల్ కమిటీ (ఐసీ) ఉండాలి. అందులో ప్రిసైడింగ్ అధికారి, ఆ కార్యాలయ సభ్యులు సహా బయటి నుంచి ఒక నిపుణుడితో కలిసి కమిటీ పనిచేయాలి. మీ కార్యాలయంలో ఆ కమిటీ పనిచేయకపోతే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. రాష్ట్రంలోని ఏ కార్యాలయంలోని సిబ్బంది అయినా ఫిర్యాదులు చేసేందుకు, శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం మీరు మహిళా భద్రత విభాగంలోని సాహస్ మాడ్యూల్ సిబ్బందిని సంప్రదించొచ్చు. మీ అభ్యర్థన మేరకు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ప్రశ్న: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో మాకు తెలిసిన వాళ్లు లోన్ తీసుకొని నా పేరు ష్యూరిటీగా పెట్టారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరే కట్టాలని మూడు నంబర్ల నుంచి ఫోన్ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. నాతోపాటు నా మరదలికి కూడా 928xxx2832, 630xxx3981, 630xxx9649 నంబర్ల నుంచి ప్రతిరోజూ కాల్స్ వస్తున్నాయి. మమ్మల్ని వేధిస్తున్న వ్యక్తులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మనవి. – (ప్రియాంక)
జవాబు: మీరు వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్లు మీకు తగిన సాయం చేస్తారు.
ప్రశ్న: హైదరాబాద్‌లో స్వాగ్ అనే ఒక ఆఫీస్ (అది ఫేక్ కంపెనీ)లో జాబ్ ఉందని మా సిస్టర్ కాల్ చేస్తే ఉద్యోగం కోసం వెళ్లా. అక్కడ శ్యామ్ అనే వ్యక్తి నన్ను గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం మా ఇంట్లో చెప్పాను. మా అమ్మ అతడితో మాట్లాడితే డబ్బిస్తా.. ప్రెగ్నెన్సీ తీయించాలని చెబుతున్నాడు. నన్ను మోసం చేసినట్లే శ్యామ్ ఎందరో ఆడపిలల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు చావు తప్ప వేరే దారి లేదు. నాకు న్యాయం చేయండి..? – (శ్రీజ)
జవాబు: మీరు వెంటనే మీ దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీకు మా నుంచి సహాయం కావాలంటే లక్డీకాపూల్‌లోని మహిళా భద్రత విభాగం కేంద్ర కార్యాలయంలో సంప్రదించండి. మీకు తగిన సూచనలతోపాటు న్యాయపరమైన అంశాల్లో సాయం అందిస్తాం.
ప్రశ్న: నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య ఎవరో ఒక వ్యక్తి నా భర్త మొబైల్‌కు నా గురించి చెడుగా మెసేజ్‌లు పంపుతున్నాడు. వాటిని నమ్మి నా భర్త వారం నుంచి నాతో గొడవపడుతున్నాడు. అవతలి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రోజూ గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి నా భర్తకు ఫోన్లు చేసి నా గురించి చెడుగా చెబుతున్నాడు. దయచేసి చర్యలు తీసుకోగలరు..? – (చందన, హనుమకొండ జిల్లా)
జవాబు: మీ సమస్యను మా అధికారులు పరిశీలిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: గుర్తుతెలియని ఈ–మెయిల్ ఐడీ ద్వారా నన్ను వేధిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్‌కు కూడా పోస్టులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోగలరు. - (నిహారిక)
జవాబు: మహిళా భద్రత విభాగం మీ ఫిర్యాదును తీసుకుంది. వివరాల కోసం మా షీ–టీమ్స్ అధికారి సంప్రదిస్తారు.
ప్రశ్న: నాకు వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తుంటే నా భర్తపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినా ఏదో రకంగా వేధిస్తున్నాడు. మా ఇంట్లో హిడెన్ కెమెరాలు పెట్టినట్టు నా అనుమానం. ఈ సమస్యల నుంచి బయటపడేలా నాకు పరిష్కారం చూపగలరు. -(హరిణి)
జవాబు..: మా టీం మిమ్మల్ని సంప్రదించినా హిడెన్ కెమెరాలకు సంబంధించి తగిన వివరాలు ఇవ్వలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment