అవగాహన పెంచుకో... అస్త్రాలను వాడుకో..! | T-Safe app: DG Shikha Goyal | Sakshi
Sakshi News home page

అవగాహన పెంచుకో... అస్త్రాలను వాడుకో..!

Published Mon, Apr 7 2025 6:08 AM | Last Updated on Mon, Apr 7 2025 6:20 AM

T-Safe app: DG Shikha Goyal

మహిళా భద్రత కోసం అందుబాటులో పోలీసుల సాంకేతికత

ఒంటరి ప్రయాణంలో తోడుగా ‘టీ–సేఫ్‌’యాప్‌ 

సాధారణ ఫోన్‌ అయితే డయల్‌ 100 వాడుకోవచ్చంటున్న పోలీసులు  

వీటి వినియోగంపై మరింత అవగాహన పెరగాలంటున్న నిపుణులు 

మీ భద్రత కోసమే టీ–సేఫ్‌: మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్‌

అప్రమత్తత, అవగాహన ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడే ఉపాయం మనకు తడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉండేలా ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో వీటి వినియోగం ఉండడం లేదు. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల భద్రత కోసం అమ్ముల పొదిలిలో అస్త్రం వంటి టీ–సేఫ్‌ యాప్‌(T-Safe App)ను తెలంగాణ మహిళా భద్రత విభాగం గతేడాది అందుబాటులోకి తెచ్చింది. 

ఎంతో ఉపయుక్తమైన ఈ యాప్‌ తెలంగాణలోని ప్రతి మహిళ మొబైల్‌ఫోన్‌లో తప్పక ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. టైంపాస్‌ కోసం సోషల్‌ మీడియా, గేమింగ్‌ యాప్‌లకు బదులు ఇలాంటి సాంకేతిక అ్రస్తాలను మన ఫోన్‌లో ఉంచుకుంటే ఆపద సమయంలో వాడుకోవచ్చని అంటున్నారు. మహిళా భద్రత కోసం పోలీసులు అందుబాటులో ఉంచిన సాంకేతికతపై ప్రత్యేక కథనం.     – సాక్షి, హైదరాబాద్‌

టీ–సేఫ్‌ యాప్‌ ఏంటి?
ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు, బాలికలు, ఇతర పౌరులెవరైనా సురక్షితంగా గమ్యం చేరే వరకు పోలీసుల పర్యవేక్షణ కొనసాగేలా తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం రూపొందించిన నూతన సాంకేతికతే టీ–సేఫ్‌ (ట్రావెల్‌–సేఫ్‌) యాప్‌. దేశంలోనే తెలంగాణ పోలీసులు ఈ తరహా సేవను మొదటిసారిగా అమల్లోకి తెచ్చారు. స్మార్ట్‌ఫోన్‌తోపాటు సాధారణ ఫోన్లు ఉన్నవారు సైతం టీ–సేఫ్‌ సేవలను పొందేలా దీన్ని రూపొందించారు. ఎన్ని రకాలుగా వాడుకోవచ్చంటే..  

1.స్మార్ట్‌ఫోన్‌లో టీ–సేఫ్‌ యాప్‌...:  
స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు గూగుల్‌ప్లే స్టోర్‌లో( https: //play.google. com/store/apps/ details?id=com.tswome nsafety.tsafe) టీ– సేఫ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో యాప్‌లో సూచించిన విధంగా మన వివరాలు నమోదు చేస్తే.. యాప్‌ ద్వారా పోలీసులు లైవ్‌ ట్రాకింగ్‌ ద్వారా ప్రయాణాన్ని పర్యవేక్షిస్తారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రంగంలోకి దిగుతారు.

2 టీ–సేఫ్‌ వెబ్‌సైట్‌ ద్వారా...:
మొబైల్‌లో టీ–సేఫ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండకపోతే,  https://tsafe.tspoli ce.gov.in/wap/ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులోకి లాగిన్‌ అయిన తర్వాత.. పేరు, మొబైల్‌ నంబర్, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి వెళ్లాలి తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత స్టార్ట్‌మై ట్రిప్‌ ఆప్షన్‌ ఓకే చేయాలి. అంతే ప్రయాణికురాలు లేదా ప్రయాణికుడు సురక్షితంగా గమ్యం చేరే వరకు పోలీసులు పర్యవేక్షిస్తారు.

3 సాధారణ ఫోన్‌తోనూ... డయల్‌ 100 ద్వారా...:
స్మార్ట్‌ ఫోన్‌ లేకపోయినా టీ–సేఫ్‌ సేవలు వాడుకోవచ్చు. సాధారణ ఫోన్‌ ఉన్నవారు ప్రయాణం ప్రారంభించే ముందు డయల్‌ 100కు కాల్‌ చేయాలి. అందులో వచ్చే ఐవీఆర్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) ఆప్షన్లో 8 నంబర్‌ను నొక్కాలి. వ్యక్తిగత వివరాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం.. ప్రయాణించే వాహనం నంబర్‌ లాంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. వెంటనే ఒక కోడ్‌ నంబర్‌ను పెట్టుకోవాల్సిందిగా సూచిస్తారు.

ఆ తర్వాత గమ్యం చేరేవరకు పోలీసుల నుంచి ప్రతీ 15 నిమిషాలకు మీకు అలర్ట్‌ మెసేజ్, మధ్యలో ఐవీఆర్‌ పద్ధతిలో ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి. ఆ ఫోన్లో ఇతరులు ఆన్సర్‌ చేసేందుకు అవకాశం లేకుండా ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కోడ్‌ ఉపకరిస్తుంది. ఒకవేళ సరైన స్పందన లేకపోతే వెంటనే వాహనం వివరాలు, రూట్, లైవ్‌ ట్రాకింగ్‌ లింక్‌ ఆ పరిధిలోని పోలీస్‌ ప్యాట్రో వాహనాలకు వెళ్తాయి. నిమిషాల వ్యవధిలోనే వారు సదరు వాహనం వద్దకు చేరుకుంటారు.

తెలంగాణలో మొబైల్‌ ఫోన్ల వాడకం ఇలా...
2025 మార్చినాటికి తెలంగాణలో 4 కోట్లకు పైగా మొబైల్‌ ఫోన్లు వినియోగంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 1.9 నుంచి 2.2 కోట్ల మంది మహిళలు వాడుతున్నట్లు అంచనా. ఈ లెక్కన చూస్తే మహిళల భద్రతకు సంబంధించి పోలీసులు అందుబాటులోకి తెచి్చన యాప్‌లు, ఇతర సాంకేతికతకు సంబంధించిన యాప్‌ల వినియోగం ఎంతో పెరగాల్సి ఉంది.  

పోలీస్‌ రెస్పాన్స్‌ టైం ఇదీ... 
ఆపదలో ఉన్నామని పౌరుల నుంచి ఫోన్‌ కాల్‌ వచి్చన తర్వాత తెలంగాణ పోలీస్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టైం హైదరాబాద్‌ సహా నగర, పట్టణ ప్రాంతాల్లో సగటున 5–10 నిమిషాలు కాగా.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 15–20 నిమిషాలకుపైగా ఉంది.  

ఆపదలో ఉన్నారా..?
డయల్‌ 100కు ఫోన్‌ చేయొచ్చు.  
డయల్‌ 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేయొచ్చు.  
ఒంటరి ప్రయాణ సమయంలో టీ–సేఫ్‌ యాప్‌ను వాడోచ్చు.  

టీ–సేఫ్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ డౌన్‌లోడ్‌లు: 42,000+  
టీ–సేఫ్‌ యాప్‌ వాడిన మొత్తం ట్రిప్పులు: 36,263 
ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌లు వాడిన వారి సంఖ్య: 26,000+  
ఆటోమేటెడ్‌ వెరిఫికేషన్‌ 
కాల్స్‌:     78,000+  
టీ–సేఫ్‌ ఏజెంట్‌ కాల్స్‌: 65,000+  
గూగుల్‌ రేటింగ్‌: 4.8

టీ–సేఫ్‌ వాడిన వారిలో కొందరు గూగుల్‌ రివ్యూలో ఇలా పేర్కొన్నారు..
బోది జియన్నా.. ఫిబ్రవరి 19, 2025 
టీ–సేఫ్‌ మహిళల భద్రతకు ఎంతో ఉపయోగపడే యాప్‌. నేను అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ యాప్‌ను వినియోగించాను. నా ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీస్‌ టీం ఫాలోఅప్‌ చేస్తూనే ఉంది. థాంక్యూ తెలంగాణ పోలీస్‌.

సీహెచ్‌. కీర్తిశ్రీ.. జనవరి 23, 2025 
నేను హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు దీన్ని సిఫార్సు చేశాడు. ప్రతి అమ్మాయి భద్రత కోసం దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు నేను సురక్షితంగా ఉన్నానో లేదో తనిఖీ చేయడానికి నాకు చాలా కాల్స్‌ వచ్చాయి. మొత్తం పోలీసు శాఖ నా వెనుక ఉందని నాకు అనిపించింది.

హన్సిక.. డిసెంబర్‌ 18, 2024
నేను చాలా సురక్షితంగా నా ఇంటికి వెళ్తున్నాను. ప్రతి అమ్మాయికి ఇది చాలా మంచి యాప్‌. మీరు డయల్‌ 100కు కాల్‌చేసినా కూడా పోలీసులు చుట్టూ ఉంటారు. మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి వెళ్తారు. నేను చాలా రోజులుగా దీనిని ఉపయోగిస్తున్నా.  

సురక్షిత ప్రయాణానికి టీ–సేఫ్‌...
టీ–సేఫ్‌ అనేది దేశంలో మొట్టమొదటి రైడ్‌–మానిటరింగ్‌ సేవ. ఇది ప్రత్యక్ష ట్రాకింగ్, పోలీసు హెచ్చరికలతో కాల్‌ లేదా యాప్‌ ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. యాప్‌ డౌన్‌లోడ్‌ ద్వారానే కాదు.. 100కు డయల్‌ చేసి ఐవీఆర్‌లో 8 నొక్కవచ్చు. ప్రయాణికుడు గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఏవైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. వెంటనే అక్కడకు చేరుకుంటారు.        – శిఖాగోయల్, మహిళా భద్రత విభాగం డీజీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement