మహిళలకు భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల్లో టాప్ 5లో హైదరాబాద్
120 నగరాల్లో జాతీయ సర్వే చేపట్టిన అవతార్ గ్రూప్
దేశీయంగా భద్రత, సంరక్షణలో దక్షిణాది బెస్ట్
ఉత్తమ నగరాలుగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత, నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలతో పాటు ఇతర ప్రామాణిక అంశాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ 5 నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 120 నగరాల్లో అవతార్ గ్రూప్ చేపట్టిన సర్వేలో 2024 సంవత్సరానికి హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా.. ఈ టాప్ 5 (బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె) నగరాల్లో 3 దక్షిణాది నుంచే ఉండటం విశేషం.
ఇందులో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. అవతార్ గ్రూప్ నిర్వహించిన ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా–2024’ (టీసీడబ్ల్యూఐ) ఇండెక్స్ సర్వేను బుధవారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేశ్ వెల్లడించారు. ఈ ఇండెక్స్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ), వరల్డ్ బ్యాంక్, క్రైమ్ రికార్డ్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వంటి వివిధ డేటా వనరుల ఆధారంగా తయారు చేశారు.
మౌలిక సదుపాయాలు, టెక్ జాబ్స్ భేష్...
120 నగరాల్లో సర్వే చేపట్టగా, మౌలిక సదుపాయాల కల్పనలో 8.01 పాయింట్లతో హైదరాబాద్ అత్యధిక స్కోర్‌ను సాధించింది. మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ప్రయాణ సౌకర్యాలలోనూ ఆదర్శ నగరంగా నిలిచింది. ముఖ్యంగా మహిళ భద్రత కోసం షీ టీమ్స్, మెట్రో రైలు ప్రధానాంశాలుగా నిలిచాయి.
టెక్నాలజీ రంగంలో మహిళలు అత్యధిక ఉద్యోగాలు పొందిన నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. భద్రతలో 6.95 పాయింట్ల తో 2వ స్థానంలో ఉంది. నైపు ణ్యం, ఉపాధిలో 6.95 పాయింట్లతో 5వ స్థానంలో నిలువగా... ఈ వరుసలో ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ ముందంజలో ఉన్నా యి. మొత్తంగా మహిళలకు అత్యుత్తమ నగరాల్లో దక్షణాది రాష్ట్రాలు భేష్ అనిపించుకున్నాయి.
హక్కులు, సమానత్వం అందాలి
అవతార్ గ్రూప్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహిళలకు రక్షణ, ఆరోగ్యం, వారు చేసే ఉద్యోగాల్లో సురక్షిత వాతావరణం, జీవన నాణ్యత తదితర అంశాలు ప్రధానమైనవి. 2047 వరకు వికసిత్ భారత్‌గా నిర్మించుకోవడంలో మహిళల హక్కులు, సమానత్వం కీలకం.
– డాక్టర్ సౌందర్య రాజేశ్, అవతార్ గ్రూప్ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment