స్టిక్కర్లు అంటించేటప్పుడే చేదు అనుభవాలు
ఆరు గ్యారంటీల్లో ఏమిచ్చారని నిలదీతలు
ఇప్పుడీ వివరాలెందుకంటూ యక్ష ప్రశ్నలు
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో ఇళ్ల గేట్లూ తెరవని వైనం
కుక్కలను ఉసిగొల్పడంతో భయభ్రాంతుల్లో సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే గ్రేటర్‌లో పరిధిలో అయోమయంగా మారింది. ఇంటింటికీ వెళ్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న యక్ష ప్రశ్నలతో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ‘ఈ సర్వేకో దండం.. మేం చేయలేం సార్’ అంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లను కనీసం గేట్లు కూడా తీయనియ్యలేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇంకొందరు కుక్కల్ని కూడా ఉసిగొల్పుతున్నారని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందించిన దరఖాస్తులకే ఇప్పటి వరకు దిక్కులేదు.. అప్పుడు రెండు రోజులపాటు పడిగాపులు కాసి ఇచి్చనా, వాటితో మాకెలాంటి ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు ఈ సర్వేలో మీకెందుకు వివరాలివ్వాలంటూ ముఖం మీదే కుండబద్దలు కొడుతున్నారు.
స్టిక్కర్లతోనే చుక్కలు కనిపిస్తున్నాయి..
వాస్తవానికి నగరంలో సర్వే నామమాత్రంగానే ప్రారంభమైంది. శుక్రవారం నాటికి పూర్తి కావాల్సిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమం పూర్తికానందున శనివారం కూడా ఆ పనిలోనే ఉన్నారు. స్టిక్కర్లు అంటించేటప్పుడే కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ.. చాలామంది తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం లేదు. పేర్లు చెప్పేందుకు కూడా పలువురు యక్ష ప్రశ్నలు వేస్తున్నా రు. అసలు ఈ సర్వేతో తమకేంటి లాభం? అంటూ విసురుతున్న ప్రశ్నలతో ఎన్యూమరేటర్లుగా వ్యవహరిస్తున్న ఆశావర్కర్లు తెల్లబోతున్నారు.
ఆర్థిక పరిస్థితి వంటివి తెలుస్తుంది సార్ అంటే.. మా ఆర్థిక పరిస్థితి నీకెందుకు చెప్పాలి? నువ్వేం చేస్తావ్ ? అంటున్నారని.. ఫారాలు నింపాక పై అధికారులకిస్తాం అంటే.. వారేం చేస్తారు ? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు. స్టిక్కర్ల నాడే పరిస్థితి ఇలా ఉంటే.. అసలు సర్వే ఎలా చేయాలని వాపోతున్నారు. ఎన్యుమరేటర్లుగా వ్యవహరిస్తున్న టీచర్లు మాత్రం వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వారిని తృప్తిపరచలేకపోతున్నామన్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితిని తట్టుకోలేక కాబోలు చాలా ప్రాంతాల్లో స్టిక్కర్లను చడీచప్పుడు కాకుండా ఇంటి బయట గోడలకు అంటించి పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటించకుండానే గేటు బయట నుంచే ఇంటి ఆవరణలోకి విసిరి వేశారు.
సీఎంపై తిట్ల దండకం..
ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే తిడుతున్నారని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో విధుల్లో ఉన్న ఓ మహిళా ఎన్యుమరేటర్ పేర్కొన్నారు. సీఎంను తిడుతున్న వారిలో మహిళలు, వృద్ధులు సైతం ఉన్నారని ఆమె ఆన్నారు. ఆరు గ్యారంటీల్లో సబ్సిడీ గ్యాస్, ఇళ్లు, పెన్షన్‌లు, మహిళలకు రూ.2500 ఏవీ రావడం లేదని, ఇప్పుడు మీకు మా వివరాలు చెబితే ఉన్న రేషన్ కార్డు కూడా పోతుందేమోనని అంటున్నవారూ ఉన్నారని మరో ఎన్యుమరేటర్ తనకెదురైన అనుభవాన్ని వివరించారు. వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు అడగొద్దని తిప్పి పంపిస్తున్నవారూ ఉన్నారు. చెరువుల్లో ఉన్నాయని ఇళ్లు కూలుస్తున్నారని హైడ్రాను ప్రస్తావిస్తూ.. తమ ఇంటి వివరాలిస్తే మా ఇల్లు కూడా కూలుస్తారేమోననే భయాన్ని వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారని ఎన్యుమరేటర్లు అంటున్నారు.
కోడ్‌లు నింపడానికి ఎంతో సమయం..
ఒక్కో ఇంటికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోందని చెబుతున్నారు. సమాధానాల్ని సంబంధిత కోడ్‌తో సూచించాల్సి ఉన్నందున అన్నీ అర్థం చేసుకొని భర్తీ చేసేందుకు సమయం పడుతోందంటున్నారు. చాలామంది వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండగా, కొందరు మాత్రం తమ జంతువుల వివరాలు సైతం చెబుతున్నారు. ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులతోనూ స్టిక్కర్లు అంటిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment