జాప్యమైతే.. పనులు నిలిపేయండి
నెల్లూరు(పొగతోట) : ‘మంజూరైన పనులను ప్రారంభించడంలో నెలల కొద్దీ జాప్యమైతే ఎలా?.. అటువంటి పనులను నిలిపివేయండి’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. చిన్న పనులను కూడా ఏళ్ల తరబడి చేపడితే ఫలితం ఏముంటుందని ప్రశ్నించారు. మంజూరై చేపట్టని పనుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వాటిని నిలుపుదల చేయాలని సూచించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.2.50 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు పూర్తి చేయడంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయ పనులు పూర్తి చేయడానికి రూ.1.50 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. జెడ్పీ భవనాన్ని అధునాతన సదుపాయాలతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో మంచినీటి సరఫరా మెరుగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న బోర్లు, మోటార్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జితేంద్ర, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పురుషోత్తం, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.