Ragavendra reddy
-
ఈ విజయం వారిదే: రాజేంద్రప్రసాద్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి మా ‘శాసనసభ’తో నిరూపించారు. ఈ విజయం వారిదే’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసన సభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శాసనసభ’లో నేను చేసిన నారాయణ స్వామి పాత్రకి మంచి పేరొచ్చిందంటే దానికి కారణం రచయిత రాఘవేందర్ రెడ్డి, దర్శకుడు వేణు.. నాది మూడో స్థానం. సినిమా విడుదలైన మూడో రోజే 60 థియేటర్స్ పెరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రవిజయం పట్ల యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. -
ఆదర్శప్రాయుడు సర్వేపల్లి
నెల్లూరు (సెంట్రల్) : భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువునే విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకుని వారి పిల్లలను అక్కడే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని బొమ్మిరెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ రాధాకృష్ణన్ తెలుగువారైనందుకు అందరూ గర్వ పడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 63 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌లు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఈఓ ఉష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాప్యమైతే.. పనులు నిలిపేయండి
నెల్లూరు(పొగతోట) : ‘మంజూరైన పనులను ప్రారంభించడంలో నెలల కొద్దీ జాప్యమైతే ఎలా?.. అటువంటి పనులను నిలిపివేయండి’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. చిన్న పనులను కూడా ఏళ్ల తరబడి చేపడితే ఫలితం ఏముంటుందని ప్రశ్నించారు. మంజూరై చేపట్టని పనుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వాటిని నిలుపుదల చేయాలని సూచించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.2.50 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు పూర్తి చేయడంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయ పనులు పూర్తి చేయడానికి రూ.1.50 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. జెడ్పీ భవనాన్ని అధునాతన సదుపాయాలతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో మంచినీటి సరఫరా మెరుగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న బోర్లు, మోటార్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జితేంద్ర, పంచాయతీరాజ్ ఎస్ఈ పురుషోత్తం, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
అందరి సహకారంతో అభివృద్ధి
నెల్లూరు(పొగతోట): రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో 14వ చైర్మన్‌గా ఆయన గురువారం ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. పండితులు వేదమంత్రాలు జపించి బొమ్మిరెడ్డిని ఆశీర్వదించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. గతంలో తాను ఏఎస్‌పేట జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా పని చేశానని, జిల్లా పరిషత్ పాలనపై అవగాహన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని బొమ్మిరెడ్డి చెప్పారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో తనకు సహకరించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ఈ ఆందోళనల్లో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బొమ్మిరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మంచి వ్యక్తి అన్నారు. జిల్లాలో సుపరిపాలన అందించగల సత్తా బొమ్మిరెడ్డికి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, 10 మంది ఎమ్మెల్యేలు కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాగద్వేషాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ 23 మంది జెడ్పీటీసీ సభ్యులు తమ వెన్నంటి ఉండి అఖండ విజయాన్ని అందించారన్నారు. బెదిరిం పులకు భయపడక, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ వెన్నంటి ఉన్న జెడ్పీటీసీ సభ్యులు ఆణిముత్యాలన్నారు. నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్ టీ జెడ్పీటీసీ సభ్యులు తమకు అండగా నిలిచారన్నారు. కోటీశ్వరులైన సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలకు తెలుసునన్నారు. నెల్లూరు నగర, సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల ఉద్యోగులు బొమ్మిరెడ్డికి అభినందనలు తెలిపారు. మొదటి సంతకం మహిళాభివృద్ధికే... జెడ్పీ సీఈఓ జితేంద్ర సమక్షంలో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తన మొదటి సంతకం మహిళాభివృద్ధి కోసమే చేశారు. మహిళా ప్రాంగణంలోని భవనాల మరమ్మతుల కోసం రూ.5 లక్షల గ్రాంటు మంజూరు చేస్తూ సంతకం చేశారు.