నెల్లూరు (సెంట్రల్) : భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువునే విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారన్నారు.
ఇటీవల కాలంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకుని వారి పిల్లలను అక్కడే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని బొమ్మిరెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ రాధాకృష్ణన్ తెలుగువారైనందుకు అందరూ గర్వ పడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 63 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌లు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఈఓ ఉష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు సర్వేపల్లి
Published Sat, Sep 6 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement