7 బిల్లులకు గవర్నర్‌ ఓకే | Governor Radhakrishnan approves pending bills Of Telangana | Sakshi
Sakshi News home page

7 బిల్లులకు గవర్నర్‌ ఓకే

Published Sun, Jul 7 2024 5:57 AM | Last Updated on Sun, Jul 7 2024 5:57 AM

Governor Radhakrishnan approves pending bills Of Telangana

పెండింగ్‌లో ఉన్న బిల్లులకు రాధాకృష్ణన్‌ ఆమోదం 

దీర్ఘకాలంగా రాజ్‌భవన్‌లోనే ఆ బిల్లులు..  

బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిపాదించిన పలు బిల్లులకు తమిళిసై నో 

ఇటీవల రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ భేటీ 

పెండింగ్‌ బిల్లుల ప్రస్తావన.. వెంటనే ఆమోదముద్ర 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శనివారం ఆమోదం తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులతో పాటు తెలంగాణ స్టేట్‌ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) బిల్లు, తెలంగాణ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ బిల్లు, తెలంగాణ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గత సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సుమారు రెండు గంటలపాటు సమావేశమై పెండింగ్‌ బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ పెండింగ్‌ బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. 

గత బీఆర్‌ఎస్‌ సర్కారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చాలా బిల్లులను నాటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించకుండా సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో తమిళిసై కొన్ని బిల్లులను మాత్రమే ఆమోదించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్రపతికి పంపించారు. 

మిగిలిన బిల్లులను తిరస్కరించడం లేదా ప్రభుత్వానికి తిప్పి పంపించడం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌ బిల్లుల్లో నాలుగింటిని గత బీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి రాష్ట్ర శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపినా తమిళిసై ఆమోదించలేదు. తాజాగా ఏడు బిల్లులను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది.  

మరో ఐదు ప్రైవేటు వర్సిటీలకు చాన్స్‌ 
తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్‌ ఆమోదించడంతో రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కలగనుంది. ఈ బిల్లును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించింది. కాగా మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో ఎన్‌ఐసీఎంఏఆర్‌ (NICMAR) యూనివర్సిటీ, సంగారెడ్డిలో ఎంఎన్‌ఆర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురునానక్, మేడ్చల్‌ జిల్లా ఘటకేసర్‌ మండలం యామ్నంపేటలో శ్రీనిధి, సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో కావేరి వర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. 

‘అవిశ్వాసం’ ఇక నాలుగేళ్ల తర్వాత.. 
మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు–2022కు ఆమోదముద్ర లభించడంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌/వైస్‌ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీస కాల వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెరిగింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లు/చైర్‌ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు/వైస్‌ చైర్‌పర్సన్లపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టడానికి వారి పదవీ కాలం కనీసం మూడేళ్లు ముగిసి ఉండాలని మున్సిపాలిటీల చట్టం పేర్కొంటోంది. మేయర్లు/చైర్‌ పర్సన్లు, వైస్‌ చైర్మన్లు/డిప్యూటీ మేయర్లను బెదిరించడానికి, బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి కౌన్సిలర్లు/కార్పొరేటర్లు ఈ నిబంధనను దురి్వనియోగం చేస్తున్నారని పేర్కొంటూ గత ప్రభుత్వం ఈ వ్యవధిని 4 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన చేసింది.  

రాజ్యసభ సభ్యులకూ ఓటు హక్కు 
మున్సిపాలిటీల ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వ్యవహరిస్తారని మునిసిపాలిటీల చట్టంలో ఉండగా, చైర్‌పర్సన్‌/మేయర్, వైస్‌ చైర్‌పర్సన్‌/డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటేసే హక్కు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఉన్నట్టు చట్టంలో ఉంది. ‘రాజ్యసభ సభ్యులు’ అనే పదాన్ని చేర్చడంలో చట్టం రూపొందించే సమయంలో పొరపాటున మరిచిపోయారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది.   

– ఇక జీహెచ్‌ఎంసీలో ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులకు గాను ఇద్దరు మైనారిటీలు ఉండాలి. జీహెచ్‌ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో కోఆప్షన్‌ సభ్యుల సంఖ్య 9కి, వారిలో మైనారిటీల సంఖ్య 6కి పెంచాలనే మరో ప్రతిపాదన ఈ బిల్లులో పెట్టారు.   

మున్సిపాలిటీగా ములుగు 
ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పు సంబంధిత అంశం కూడా బిల్లు ద్వారా ప్రతిపాదించారు. దీనిని కూడా రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించారు.  

3 పంచాయతీలుగా భద్రాచలం 
తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు–2023కు ఆమోదం లభించడంతో పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది.  

మైనారిటీల జాబితాలో జైనులు 
– తెలంగాణ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రంలోని మైనారిటీల జాబితాలో జైనులకు కూడా చోటు లభించింది. రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలతో పాటు కొత్తగా జైన మతస్తుడిని సైతం సభ్యుడిగా నియమించడానికి వీలు కలిగింది.  
– తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) బిల్లు ద్వారా హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు బోధనాస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement