గవర్నర్ తమిళిసైకి పుష్పగుచ్ఛం అందిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్‌భవన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) ఆయన వెంట ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి. గవర్నర్ దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం గవర్నర్‌తో దాదాపుగా 15 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని గవర్నర్‌ను సీఎం కోరారు.
గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పాలన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, ప్రణాళికలను రేవంత్ వివరించినట్టు సమాచారం.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర ఆరంభం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. ఓపెన్‌హౌస్ నిర్వహించి అతిథుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర సీనియర్ అధికారులు, 2,500 మంది సాధారణ ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ పిలుపు మేరకు పూలబోకేలకు బదులుగా చాలామంది అతిథులు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను కానుకలుగా ఇచ్చారు. దీంతో 25,000 నోట్‌బుక్స్ రాజ్‌భవన్‌కు అందాయి. ఈ పుస్తకాలను జీహెచ్‌ఎంసీ, గిరిజన ప్రాంత మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌కు సంబంధించిన వాట్సాప్ చానల్ ( https:// whatsapp. com/ channel/0029VaIxdrC4 NVicOQDVvY3 L)ను కూడా ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాల వార్తలు, ఫొటోలను దీనిద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి: గవర్నర్
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, వర్సిటీల్లో తక్షణమే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రాజ్‌భవన్ తరఫున కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తమిళిసై హామీ ఇచ్చింనట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment