సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శనివారం (10న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 11న విరామం ఇచ్చి.. 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చించనున్నారు. 13న బడ్జెట్‌ను ఆమోదించి, ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల అధ్యక్షతన వేర్వేరుగా సమావేశమైన ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశ మందిరంలో అసెంబ్లీ, శాసన మండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. తర్వాత సభలను వాయిదా వేశారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపి, ఆమోదిస్తాయి. శనివారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెడతారు.
11న ఆదివారం విరామం. 12న అసెంబ్లీ, మండలి వేర్వేరుగా సమావేశమై బడ్జెట్ అంశాలపై చర్చిస్తాయి. 13న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదిస్తారు. దీనితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే.. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన తీర్మానా లు, అంశాలు చర్చకుపెడతారని సీఎం రేవంత్‌రెడ్డి బీఏసీ భేటీలో సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆయా అంశాలను సభ ముందు పెట్టే అంశంపై మరోమారు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన శాసనమండలి బీఏసీ కూడా.. శాసనసభ తరహాలోనే ఈ నెల 13 వరకు సమావేశం కావాలని నిర్ణయించింది. ’
బీఏసీలలో ఎవరెవరు?
శాసన మండలి, శాసనసభల నిర్వహణ షెడ్యూల్, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయడానికి.. అధికార, ప్రతిపక్షాల సభ్యులతో ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’లను ఏర్పాటు చేస్తారు. సమావేశాల ప్రారంభం రోజున ఈ బీఏసీలు స్పీకర్/చైర్మన్ అధ్యక్షతన సమావేశమై.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగే తేదీలు, చర్చించే అంశాలను నిర్ణయిస్తాయి. రాష్ట్ర కొత్త శాసనసభ ఏర్పాటైన నేపథ్యంలో ‘బీఏసీ’ని ఏర్పాటు చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ భేటీలో అధికార పక్షం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, విప్ బీర్ల అయిలయ్యకు చోటు కల్పించారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నుంచి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ)లకూ అవకాశం కల్పించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనందున ఆ పార్టీ విజ్ఞప్తి మేరకు మహేశ్వర్‌రెడ్డికి చోటు దక్కింది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో.. డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమూద్ అలీ (బీఆర్‌ఎస్), ఏవీఎన్ రెడ్డి (బీజేపీ), ఎఫెండీ (ఎంఐఎం), అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment