‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు.
ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్‌గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్ నితిన్ ముఖేశ్‌లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.
అక్టోబర్ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్ నటిగా వెలిగిపోతున్న పరిణీతి.
Comments
Please login to add a commentAdd a comment