ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు
బంగారు బోనమెత్తిన తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బుధవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ బంగారు బోనాన్ని ఎత్తుకుని సింహవాహిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడు ఒక్కడేనని.. భిన్న రూపాల్లో మనం దేవుడిని కొలుస్తామని అన్నారు. ఇదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో ఈ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుందని గవర్నర్ రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేంద్రయాదవ్, ఇతర ముఖ్యులు గవర్నర్‌కు జ్ఞాపికను అందించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కర్తవ్యపథ్ నుంచి తెలంగాణభవన్ వరకు నిర్వహించిన అమ్మవారి ఘట ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు డోలు, డప్పు దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment