కేటీఆర్ నేతృత్వంలో రాజ్ భవన్‌కు..
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీకి గవ ర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం గవర్నర్‌తో జరిగే భేటీలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.
క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్ ఉల్లంఘనలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్‌కు బీఆర్‌ఎస్ బృందం అందజేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు, వారిపై పోలీస్ కేసుల నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నా రు. ఈ నెల 23న రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్ రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికి అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్‌ఎస్ వ్యూహం సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment