
సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక, గత విచారణలో ఆపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత పిటిషన్ల పెండింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్టార్‌కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, విచారణపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్లు ఉన్నాయి. ఈ సందర్బంగా అఫిడవిట్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..‘నేను ఎన్నడూ బీఆర్‌ఎస్ పార్టీ వీడలేదు. బీఆర్‌ఎస్‌కు నేను రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. అనర్హత పిటిషన విచారణకు అర్హత లేదు. నాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోరారు. అలాగే, కేటీఆర్ ఉన్న ఫొటోలు, పోస్టర్లను అఫిడవిట్‌లో జత చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫొటో ఉంచడంపై ఫిర్యాదు కాపీని కూడా జత చేశారు.

మరోవైపు.. గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్ ఇలా ఉంది. అఫిడవిట్ ప్రకారం.. నేను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌ను కలిశాను. వ్యక్తిగత హోదాలోనే ఆయనను కలిశాను. ఆ మీటింగ్‌కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నాకు పార్టీ మారే ఆలోచనే లేదు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నాను. నేను బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నాను. ఏ దశలోనూ బీఆర్‌ఎస్‌ను వీడలేదు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. నాపై అనర్హత అనే ప్రశ్న తలెత్తదు. నేను స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ నుంచి తప్పుకున్నట్లుగా నా చర్యలను భావించవద్దు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment